World Athletics Championships : వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో టైటిల్ నిలబెట్టుకోవాలనుకున్న నీరజ్ చోప్రా (Neeraj Chopra) కల చెదిరింది. గత సీజన్లో విజేతగా నిలిచిన భారత బడిసె వీరుడు ఈసారి దారుణంగా విఫలమయ్యాడు. గురువారం జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో అతడు 85 మీటర్ల మార్క్నుఅందుకోలేకపోయాడు. ఐదు ప్రయత్నాల్లోనూ నీరజ్ ఆకట్టుకోలేకపోయాడు.
టోక్యో వేదికగా జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. కానీ.. అంచనాలను అందుకోలేకపోయాడు. కానీ.. ఈ ఏడాది ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో వెండి పతకంతో మెరిసిన సచిన్ యాదవ్ (Sachin Yadav) మాత్రం అదరగొట్టాడు. నీరజ్ జావెలిన్‌ను 85 మీటర్ల దూరం విసరలేకపోయిన చోట సచిన్ ఏకంగా 86 మీటర్ల మార్క్ అందుకొని అబ్బురపరిచాడు. కానీ.. 86.27 మీటర్లతో నాలుగో స్థానంతోనే సరిపెట్టుకున్నాడు. గత ఏడేళ్లలో పోటీపడిన ప్రతి ఈవెంట్లో మెడల్ గెలుపొందిన చోప్రా.. పతకం లేకుండా తిరిగి రావడంఇదే మొదటిసారి.
World & Olympic Champion Neeraj Chopra 🇮🇳 pic.twitter.com/jVWGs54i6L
— The Khel India (@TheKhelIndia) September 18, 2025
ఆద్యంతం ఉత్కంఠగా సాగిన టైటిల్ పోరులో ట్రినిడాడ్ వీరుడు కెషార్న్ వాల్కాట్ (Keshorn Walcott) స్వర్ణం కొల్లగొట్టాడు. టోక్యో ఒలింపిక్స్‌లో పతకంతో మెరిసిన కెషార్న్.. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో మెడల్ సాధించడం ఇదే తొలిసారి. ఫైనల్లో అతడు 88.16 మీటర్ల దూరం ఈటెను విసిర అగ్రస్థానంతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్(Anderson Peters) 87.36 మీటర్లతో రెండో స్థానంలో నిలవగా.. అమెరికా అథ్లెట్ కర్టిస్ థాంప్సన్ 86.67 మీటర్ల దూరంలో కాంస్యం గెలుపొందాడు.
వరుసగా రెండు ఒలింపిక్స్‌లో మెడల్స్‌తో చరిత్ర సృష్టించిన నీరజ్ మాత్రం.. 84.03 మీటర్లతో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. పారిస్‌లో 90 మీటర్లతో గోల్డ్ మెడల్ పట్టేసిన పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్ సైతం పేలవ ఫామ్(82.75)తో పదో స్థానం సాధించాడు.