ఒస్ట్రావా (చెక్ రిపబ్లిక్) : ఇటీవలే ముగిసిన పారిస్ డైమండ్ లీగ్లో టైటిల్ గెలిచిన జోష్లో ఉన్న భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా మరో టైటిల్ను తన ఖాతాలో వేసుకున్నాడు. చెక్ రిపబ్లిక్లోని ఒస్ట్రావా వేదికగా మంగళవారం రాత్రి జరిగిన గోల్డెన్ స్పైక్ ఈవెంట్లోనూ నీరజ్ మొదటి స్థానంలో నిలిచి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ఈ ఈవెంట్లో తొలిసారి బరిలోకి దిగిన నీరజ్.. తొలి రెండు ప్రయత్నాల్లో విఫలమైనా మూడో త్రో లో బరిసెను 85.29 మీటర్లు విసిరాడు.
తొమ్మిది మంది పాల్గొన్న ఈ ఫైనల్లో దక్షిణాఫ్రికా అథ్లెట్ డౌ స్మిత్ (84.12) రెండో స్థానంలో నిలవగా గ్రెనెడా ఆటగాడు ఆండర్సన్ పీటర్స్ (83.63) మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. కాగా టైటిల్ గెలిచినా తన ప్రదర్శన పట్ల తీవ్ర అసంతృప్తికి గురైనట్టు ఫైనల్స్ అనంతరం చోప్రా అన్నాడు. ‘ట్రోఫీ గెలిచినందుకు ఆనందంగానే ఉన్నా నేటి ప్రదర్శనపై నేను అంత సంతోషంగా లేను. నేను ఇంకా మెరుగైన ప్రదర్శన చేయాల్సింది’ అని తెలిపాడు.