Neeraj Chopra | లాసానే: భారత బల్లెం వీరుడు, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా మరోసారి సత్తా చాటాడు. పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం నెగ్గిన నీరజ్.. అవి ముగిసిన కొద్దిరోజులకే లాసానే (స్విట్జర్లాండ్) వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్‌లో జావెలిన్‌ను 89.49 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. నీరజ్‌కు ఈ సీజన్లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. గజ్జల్లో గాయం కారణంగా ‘పారిస్’లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక రజతంతో సరిపెట్టుకున్న నీరజ్.. లాసానే లోనూ తడబాటుకు గురయ్యాడు. ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్న అతడు మొదటి నాలుగు త్రోలలో బరిసెను 84 మీటర్ల దూరాన్ని దాటించలేకపోయాడు. నాలుగో రౌండ్ ముగిసేసరికి నీరజ్ నాలుగో స్థానంతో ఉన్నాడు.
కానీ ఐదో రౌండ్లో 85.58 మీటర్ల త్రో తో టాప్-3లోకి వచ్చాడు. ఇక ఆరో రౌండ్లో 89.49 మీటర్ల దూరం విసిరి రెండో స్థానానికి ఎగబాకాడు. పారిస్‌లో కాంస్యం గెలిచిన గ్రెనెడా అథ్లెట్ అండర్సన్ పీటర్స్ 90.61 మీటర్లతో అగ్రస్థానంలో నిలవగా జర్మన్ ఆటగాడు వెబర్ జులియన్ 87.08 మీటర్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. అయితే వచ్చే నెల 5న జ్యురిచ్‌లో జరుగనున్న చివరి డైమండ్ లీగ్‌లో టాప్-6లో నిలిచిన వాళ్లు..14న బ్రస్సెల్ వేదికగా జరిగే లీగ్ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. 2022లో డైమండ్ లీగ్ టైటిల్ గెలిచిన నీరజ్..గతేడాది రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.గత కొంత కాలంగా సతమతమవుతున్న ఈ స్టార్ అథ్లెట్ సీజన్ ముగిసిన తర్వాత గాయానికి శస్త్రచికిత్స చేయించుకోనున్నాడు.