ఒస్ట్రావా(చెక్ రిపబ్లిక్): టోక్యో వేదికగా జరిగే ప్రతిష్టాత్మక ప్రపంచ చాంపియన్‌షిలో విజేతగా నిలువడమే తన లక్ష్యమని భారత స్టార్ అథ్లెట్ నీరజ్‌చోప్రా ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. మంగళవారం జరిగే గోల్డెన్స్పైక్ అథ్లెటిక్స్ మీట్లో బరిలోకి దిగుతున్న నీరజ్ తన లక్ష్యాలను వివరించాడు. దోహాలో జరిగిన డైమండ్ లీగ్ పోటీలో తొలిసారి 90మీటర్ల మార్క్ అందుకున్న నీరజ్.. తాజాగా ముగిసిన పారిస్‌లో టాప్‌లో నిలిచి సత్తాచాటాడు.
దిగ్గజ జావెలిన్‌త్రో కోచ్, చెక్ రిపబ్లిక్కు చెందిన జాన్ జెలెన్జీ దగ్గర శిక్షణ పొందుతున్న తాను ఇటీవలి సాధించిన విజయాలతో మరింత ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకున్నానని తెలిపాడు. ‘దిగ్గజ కోచ్ జెలెన్జీతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. టెక్నిక్‌ను మెరుగుపర్చుకుంటూ ఈ ఏడాది తొలి టోర్నీలోనే 90మీటర్ల మార్క్ అందుకున్నాను. తాజాగా నెబుర్క్లో సీరియస్‌గా ప్రాక్టీస్ చేశాను. ఒస్ట్రావాలో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరుస్తానన్న నమ్మకం ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ 13 నుంచి టోక్యోలో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ టోర్నీలో స్వర్ణం సాధించాలనే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతున్నాను’ అని అన్నాడు.