గాయం కారణంగా తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయానని భారత డబుల్ ఒలింపియన్ నీరజ్ చోప్రా పేర్కొన్నాడు. ఇటీవలే ముగిసిన ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ వెండి వెలుగులు విరజిమ్మాడు. ఓవైపు గాయం వేధిస్తున్నా..బల్లాన్ని అద్భుతంగా విసురుతూ రెండో స్థానంలో నిలిచాడు. అంచనాలు అందుకోలేకపోవడానికి గాయం తీవ్ర ప్రభావం చూపించిందని చెప్పుకొచ్చాడు. పూర్తి ఫిట్నెస్తో ఉంటే 90మీటర్ల మార్క్‌ను కచ్చితంగా చేరుకునేవాడనని స్పష్టం చేశాడు. రానున్న డైమండ్ లీగ్ కోసం సిద్ధమవుతున్న చోప్రా..వచ్చే ఒలింపిక్స్‌లో భారత్ మరింత మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందని అన్నాడు.
Neeraj Chopra | న్యూఢిల్లీ: భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా..పారిస్ ఒలింపిక్స్ ప్రదర్శనతో పాటు పలు అంశాలపై మాట్లాడాడు. డైమండ్ లీగ్ కోసం ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో శిక్షణ తీసుకుంటున్న చోప్రా..శనివారం వర్చువల్ ఇంటర్వ్యూలో ముచ్చటించాడు.
వాస్తవానికి పారిస్ ఒలింపిక్స్‌లో 90మీటర్ల మార్క్ అందుకోవాలన్న లక్ష్యాన్ని ఎంచుకున్నాను. కానీ గజ్జల్లో గాయంతో అనుకున్న మేర జావెలిన్‌ను విసరలేకపోయాను. గాయం వేధిస్తుండటంతో రనప్ సరిగ్గా లేకపోవడం విసిరిన బల్లెం సరైన దిశలో వెళ్లకపోవడంతో లక్ష్యాన్ని అందుకోవడంలో విఫలమయ్యాను. కానీ రానున్న టోర్నీల్లో వందకు వంద శాతం విసిరేందుకు ప్రయత్నిస్తా. చూద్దాం ఏం అవుతుందో.
పారిస్ ఒలింపిక్స్‌లో నాకు, పాకిస్థాన్ జావెలిన్ త్రో అథ్లెట్ అర్షద్ నదీమ్ మధ్య స్నేహపూర్వక పోటీ కొనసాగింది. ఇద్దరం తొలిసారి విసిరినప్పుడు ఫౌల్ అయ్యాం. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో అర్షద్ 92.97 మీటర్ల దూరం విసిరి కొత్త ఒలింపిక్ రికార్డు నెలకొల్పాడు. ఆ తర్వాత వచ్చిన నా వంతులో 89.45 మీటర్ల దూరం మాత్రం విసరగలిగాను. అర్షద్‌ను చేరుకునేందుకు ప్రయత్నించినా..గాయం కారణంగా పూర్తి స్థాయిలో రాణించలేకపోయాను. వంద శాతం ప్రయత్నం చేసేందుకు శరీరం, మనసు సహకరించలేకపోయింది. గాయంతో ట్రైనింగ్ సెషన్లలో సరిగ్గా విసరలేకపోవడం నా ప్రదర్శనపై ప్రభావం చూపించింది.
పారిస్‌లో కొన్ని వైఫల్యాలు దెబ్బతీశాయి. ముఖ్యంగా జావెలిన్‌ను వేగంగా విసిరినా..లైన్ సరిగ్గా లేకపోవడంతో దూరం తగ్గింది. ఒకవేళ బల్లెం సరైన దిశలో వెళ్లి ఉంటే..మరో రెండు, మూడు మీటర్ల దూరం కలిసి వచ్చేది.
ఈనెల 22 నుంచి లూసానెలో డైమండ్ లీగ్ మొదలవుతున్నది. ఇందుకోసం ప్రాక్టీస్ చేస్తున్నాను. టాప్-6లో నిలువడం ద్వారా సెప్టెంబర్‌లో జరిగే డైమండ్ లీగ్ ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశం లభిస్తుంది. నెల రోజుల్లో సీజన్ ముగిసిన తర్వాత గాయానికి శస్త్రచికిత్స చేయించుకుంటాను.
భారత్ స్పోర్ట్స్ పవర్‌హౌజ్‌గా మారాలంటే..విప్లవాత్మక మార్పులు రావాలి. ముఖ్యంగా అందరూ అన్ని రకాల క్రీడలు ఆడేందుకు ముందుకు రావాలి. ఏ క్రీడలోనైతై రాణించగలమో గుర్తించి అందుకు తగ్గట్లు ముందుకు సాగాలి. చైనా, అమెరికా, జపాన్ పతకాల సాధనలో ముందున్నాయి అంటే వాళ్ల విధానాల వల్లే. రానున్న రోజుల్లో మనం ఒలింపిక్స్‌తో పాటు ఫిఫా ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధిస్తామన్న నమ్మకం నాకుంది.