న్యూఢిల్లీ : ఒలింపిక్ చాంపియన్, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొనే అథ్లెటిక్స్ జట్టుకు ఎంపికయ్యాడు. మొత్తం 32 మంది సభ్యులతో కూడిన భారత అథ్లెటిక్స్ జట్టును అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్ఐ) ఆదివారం ప్రకటించింది. అయితే, రాబోయే టోర్నమెంట్లలో నిర్దేశిత క్వాలిఫయింగ్ ప్రమాణాలను నీరజ్ సాధించాల్సి ఉంటుందని సెలెక్షన్ కమిటీ స్పష్టం చేసింది.
వెన్ను గాయం నుంచి కోలుకున్న చోప్రా మరో 10 రోజుల్లో తిరిగి పోటీల్లోకి దిగనున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భారత్ తరఫున బరిలోకి దిగాలంటే నీరజ్ కనీసం 82.61 మీటర్ల క్వాలిఫయింగ్ మార్కును అందుకోవాల్సి ఉంటుంది. పురుషుల జావెలిన్ త్రో విభాగంలో రోహిత్ యాదవ్, యశ్వీర్ ఇప్పటికే అర్హత మార్కును సాధించి జట్టుకు ఎంపికయ్యారు.