మెగా ఈవెంట్లలో బరిలోకి దిగాడంటే పతకం పట్టుకురావడాన్ని అలవాటుగా మార్చుకున్న భారత ‘గోల్డెన్ బాయ్’ నీరజ్ చోప్రా మరోసారి సత్తా చాటాడు. చాలాకాలంగా గజ్జల్లో గాయం వేధిస్తున్నా పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన ఈ స్టార్ జావెలిన్ త్రోయర్.. తాజాగా ఆ గాయానికి తోడు ఎడమ చేతి ఎముక విరిగినా డైమండ్ లీగ్ ఫైనల్స్ బరిలో నిలిచి రెండో స్థానంలో నిలిచాడు. తుదిపోరులో ఒకే ఒక్క సెంటిమీటర్ తేడాతో అగ్రస్థానాన్ని కోల్పోయినా.. ఏడాది పాటు నిలకడగా రాణించి 2024 సీజన్‌ను విజయవంతంగా ముగించాడు.
బ్రస్సెల్స్ (బెల్జియం) : భారత స్టార్ జావెలిన్ త్రోయర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా వరుసగా రెండో ఏడాదీ డైమండ్ లీగ్ (డీఎల్) ఫైనల్స్‌లో రెండో స్థానంతో మెరిశాడు. డీఎల్ టైటిల్ పోరులో అతడు ఒకే ఒక్క సెంటిమీటర్ తేడాతో టైటిల్ కోల్పోవడం విచారకరం. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక బ్రస్సెల్స్ వేదికగా జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో నీరజ్.. బరిసెను 87.86 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. కొద్దిరోజుల క్రితమే పారిస్ వేదికగా ముగిసిన ఒలింపిక్స్‌లో రజతం సాధించిన నీరజ్.. డీఎల్ ఫైనల్స్‌లోనూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేశాడు. ఇదివరకే గజ్జల్లో గాయం వేధిస్తున్నా.. తుదిపోరుకు ముందు ఎడమ చేతి వేలికి గాయమైనా నొప్పిని ఓర్చుకుని ఫైనల్ బరిలో నిలిచిన నీరజ్ తనపై పెట్టుకున్న అంచనాలను వమ్ము చేయలేదు. పారిస్‌లో కాంస్య పతకం గెలిచిన గ్రెనెడా అథ్లెట్ అండర్సన్ పీటర్స్ 87.87 మీటర్ల దూరంతో అగ్రస్థానాన నిలిచి టైటిల్ దక్కించుకోగా జర్మనీ ఆటగాడు జులియన్ వెబర్ 85.97 మీటర్ల త్రో తో మూడో స్థానంలో నిలిచాడు.
ఏడుగురు పోటీపడ్డ డీఎల్ ఫైనల్స్‌లో భాగంగా పీటర్స్ తన తొలి ప్రయత్నంలోనే బరిసెను 87.87 మీటర్లు విసిరాడు. నీరజ్ తన మొదటి త్రో (86.82 మీటర్లు)తో అతడికి దగ్గరిదాకా వచ్చినా ఆ మార్కును దాటలేకపోయాడు. రెండో ప్రయత్నంలో 83.49 మీటర్లే విసిరిన అతడు.. మూడో ప్రయత్నంలో మాత్రం పీటర్స్ త్రోకు అత్యంత సమీపంలోకి వచ్చాడు. ఇక ఆ తర్వాత మూడు త్రో లలోనూ అతడు జావెలిన్‌ను ఆశించిన స్థాయిలో విసరలేక రెండో స్థానంతోనే సరిపెట్టుకుని ఈ సీజన్‌ను ముగించాడు.
తాజా ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచిన నీరజ్‌కు ప్రైజ్ మనీ కింద 12వేల యూఎస్ డాలర్లు (భారత కరెన్సీలో రూ. 10.06 లక్షలు) దక్కగా పీటర్స్‌కు డైమండ్ లీగ్ ట్రోఫీతో పాటు 30 వేల యూఎస్ డాలర్లు (రూ. 25.16 లక్షలు) దక్కాయి. ఏడాదంతా నిలకడగా రాణించిన నీరజ్‌కు డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో రెండో స్థానాన నిలవడం ఇది వరుసగా రెండోసారి. 2023లోనూ అతడు సెకండ్ ప్లేస్‌కే పరిమితమయ్యాడు. 2022లో మాత్రం టైటిల్ నెగ్గాడు.
వరుసగా రెండు ఒలింపిక్స్‌లలోనూ పతకాలు (స్వర్ణం, రజతం) సాధించిన గోల్డెన్ బాయ్ మరోసారి గాయం కారణంగా అగ్రస్థానంలో నిలిచే అవకాశాన్ని కోల్పోయాడు. పారిస్ ఒలింపిక్స్‌కు ముందు గజ్జల్లో గాయమైనా ఆ నొప్పితోనే విశ్వక్రీడల్లో బరిలోకి దిగి రజతం పట్టుకొచ్చాడు. ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతున్నా దేశం కోసం ఆ నొప్పిని పక్కనబెట్టి మరీ అంతర్జాతీయ క్రీడా యవనికపై మువ్వన్నెల పతకాన్ని రెపరెలాడించిన నీరజ్.. డీఎల్ ఫైనల్స్‌లోనూ అదే పట్టుదలను ప్రదర్శించాడు. ఈ పోటీ సన్నాహకాల్లో భాగంగా ఐదు రోజుల క్రితమే నీరజ్ ఎడమ చేతి వేలికి గాయమైంది. ఎక్స్‌రేలో నాలుగో వేలు దగ్గర చీలిక వచ్చినట్టు తేలింది. కానీ నీరజ్ మాత్రం తన వైద్య బృందం సూచనలతో బరిలో నిలిచి సత్తా చాటాడు. ఒక్క సెంటిమీటర్ దూరంతో డైమండ్ లీగ్ టైటిల్ కోల్పోయినా దేశం కోసం అతడు చూపి న తెగువకు సలామ్ కొట్టాల్సిందే!