ఒకే ఒక్క త్రోతో దేశాన్ని తనవైపు తిప్పుకున్న స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. నేడు మరో చరిత్ర లిఖించేందుకు సిద్ధమయ్యాడు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో యావత్ భారతావనిని మంత్రముగ్ధుల్ని చేసిన నీరజ్.. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లోనూ సేమ్ సీన్ రిపీట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. క్వాలిఫయింగ్ రౌండ్లో కేవలం ఒకే ప్రయత్నంలో బరిసెను అల్లంత దూరం విసిరి నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించిన నీరజ్.. నేడు పతకం కోసం పోటీ పడనున్నాడు. మీరు ఈ వార్త చదివేసరికే నీరజ్ ప్రపంచ చాంపియన్‌గా నిలిచినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు!
న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఫైనల్ బరిలో దిగుతున్నాడు. క్వాలిఫయింగ్ రౌండ్లో ఒకే దెబ్బతో ఫైనల్‌కు అర్హత సాధించిన నీరజ్.. ఆదివారం పతకం కోసం పోటీ పడుతున్నాడు. నీరజ్‌తో పాటు ట్రిపుల్ జంప్‌లో ఎల్డోస్ పాల్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.
అన్ను రాణికి ఏడో స్థానం..
మహిళల జావెలిన్ త్రోలో అన్ను రాణి ఏడో స్థానంలో నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో అన్ను రాణి బరిసెను 61.12 మీటర్ల దూరం విసిరింది. వరుసగా రెండోసారి ఈ చాంపియన్‌షిప్ ఫైనల్లో బరిలోకి దిగిన అన్ను.. రెండో ప్రయత్నంలో ఈ ప్రదర్శన నమోదు చేసుకుంది. ఈ విభాగంలో కెల్సీ బార్బర్ (ఆస్ట్రేలియా; 66.91 మీ.) స్వర్ణం చేజిక్కించుకుంది.
మరో 4 రోజుల్లో
భారత అథ్లెటిక్స్ చరిత్రలో నీరజ్ చోప్రాకు ముందు.. నీరజ్ చోప్రా తర్వాత అన్నంతలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కామన్వెల్త్లో హాట్ ఫేవరెట్‌గా బరిలో దిగనున్నాడు. అతడితో పాటు మురళీ శ్రీశంకర్, అవినాశ్ సబ్లే, అన్ను రాణి పతకాలపై ఆశలు రేపుతున్నారు. ఇప్పటి వరకు కామన్వెల్త్ చరిత్రలో మనవాళ్లు 5 స్వర్ణాలు సహా 28 పతకాలు సాధించారు. అందులో అత్యుత్తమంగా 2010లో న్యూఢిల్లీ వేదికగా జరిగిన క్రీడల్లో 12 పతకాలు (2 స్వర్ణాలు, 3 రజతాలు, 7 కాంస్యాలు) గెలిచారు. ఇప్పుడా రికార్డును బద్దలు కొట్టేందుకు భారత బృందం సిద్ధమైంది. ఈ క్రీడల్లో ఫ్లయింగ్ సిక్ మిల్కాసింగ్ భారత్ తరఫున మొట్టమొదటి (1958; 440 గజాల పరుగు) స్వర్ణం నెగ్గాడు. ఒలింపిక్ చాంపియన్ నీరజ్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా.. లాంగ్ జంప్‌లో మహమ్మద్ అనీస్ ఆశలు రేపుతున్నాడు. ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్, అబ్దుల్లా, ఎల్డోస్ పాల్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 100 మీటర్ల హర్డిల్స్‌లో తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి బరిలో ఉండగా.. 4×100లో ద్యుతీచంద్, హిమదాస్ పోటీ పడుతున్నారు.