ఢిల్లీ: వచ్చే నెలలో బెంగళూరు వేదికగా జరుగనున్న నీరజ్ చోప్రా క్లాసిక్ (ఎన్సీ క్లాసిక్-2025) ఈవెంట్‌కు పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్‌ను ఆహ్వానించడంపై సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న విమర్శలపై భారత గోల్డెన్ బాయ్ స్పందించాడు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఎన్సీ క్లాసిక్‌కు పాక్ అథ్లెట్‌ను పిలవడాన్ని నిరసిస్తూ చాలామంది నెటిజన్లు నీరజ్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా నీరజ్.. ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన సుదీర్ఘమైన లేఖలో తన ఆవేదనను వ్యక్తం చేస్తూ వివరణ ఇచ్చాడు. ‘ఎన్సీ క్లాసిక్ ఈవెంట్‌కు అర్షద్‌ను ఆహ్వానించడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది.
అందులో ఎక్కువ భాగం ద్వేషం, అసభ్యకరమైనవే ఉన్నాయి. వాళ్లు నా కుటుంబాన్నీ విడిచిపెట్టలేదు. ఈ ఈవెంట్లో పాల్గొనబోయే క్రీడాకారులకు సోమవారమే (పహల్గాం ఉగ్రదాడికి ముందు) ఆహ్వానం పంపాం. అగ్రశ్రేణి అథ్లెట్లను భారత్‌కు రప్పించి ప్రపంచస్థాయిలో నిర్వహించగలమని చాటిచెప్పడమే ఎన్సీ క్లాసిక్ ఉద్దేశం. కానీ ఈ 48 గంటల్లో చాలా మార్పులు జరిగాయి. అర్షద్ ఈ ఈవెంట్‌కు హాజరుకావడమనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. నాకు నా దేశ ప్రయోజనాలే మొదటి ప్రాధాన్యత.
పహల్గాం ఘటనపై నాకు బాధతో పాటు కోపమూ ఉంది. భారత్ గర్వపడేలా చాలా ఏండ్లుగా కష్టపడుతున్నా. కానీ ఇప్పుడు నా చిత్తశుద్ధిని ప్రశ్నించడం బాధాకరంగా ఉంది. నాతో పాటు ఇంట్లో మా అమ్మనూ వాళ్లు వదల్లేదు. గతంలో ఆమె అమాయకంగా చెప్పిన మాటలను ప్రశంసించినవాళ్లే ఇప్పుడు అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తున్నారు. ప్రజలు తమ అభిప్రాయాలను ఇలా ఎలా మార్చుకుంటారో అర్థం కావడం లేదు. ఏదేమైనా ప్రపంచస్థాయిలో నా దేశాన్ని గర్వంగా నిలిపేందుకు నేను ఎల్లవేళలా కష్టపడతా. జైహింద్’ అని రాసుకొచ్చాడు.