భువనేశ్వర్: మూడేండ్ల తర్వాత స్వదేశంలో సొంత ప్రేక్షకుల మధ్య బరిలోకి దిగిన టోక్యో ఒలింపిక్స్ ‘గోల్డెన్ బాయ్’ నీరజ్ చోప్రా.. ఫెడరేషన్ కప్‌లో సత్తా చాటాడు. బుధవారం రాత్రి కళింగ స్టేడియం వేదికగా జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్.. బరిసెను 82.27 మీటర్ల దూరం విసరడంతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం సాధించాడు. తొలి ప్రయత్నంలో అతడు 82 మీటర్లే విసిరాడు. అయితే డీపీ మను 82.06 మీటర్లతో అతడిని అధిగమించాడు.
కానీ చోప్రా నాలుగో ప్రయత్నంలో 82.27 మీటర్లతో అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. డీపీ మను (82.06) రజతం నెగ్గగా 78.39 మీటర్లతో ఉత్తమ్ పాటిల్ కాంస్యం గెలుచుకున్నాడు. లోకల్ బాయ్ కిశోర్ జెన 75.25 మీటర్లతో ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇటీవలే ముగిసిన దోహా డైమండ్ లీగ్‌లో జావెలిన్‌ను 88.36 మీటర్ల దూరం విసిరి 0.2 సెంటిమీటర్ల తేడాతో అగ్రస్థానం కోల్పోయిన చోప్రా తాజాగా స్వర్ణం నెగ్గినా అతడి ప్రదర్శన మాత్రం ఆశించిన స్థాయిలో లేదు.