Diamond League | బ్రస్సెల్స్ (బెల్జియం): ఒలింపిక్స్ ముగిసిన కొద్దిరోజుల తర్వాత ప్రపంచ టాప్ అథ్లెట్లు అంతా మళ్లీ పోటీలకు సిద్ధమయ్యారు. బెల్జియంలోని బ్రస్సెల్స్ వేదికగా శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు జరిగే డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో అథ్లెట్లు మరోసారి తమ విన్యాసాలతో అలరించనున్నారు. 32 క్రీడాంశాలలో వందలాది మంది స్టార్ అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు.
భారత్ నుంచి డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా, స్టీపుల్‌ఛేజ్ రన్నర్ అవినాశ్ సాబ్లే అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో ఇద్దరు భారతీయ అథ్లెట్లు పోటీపడనుండటం ఇదే ప్రథమం. 2022 డైమండ్ లీగ్ ఫైనల్స్ గెలిచి 2023లో రెండో స్థానంలో నిలిచిన నీరజ్.. ఈ ఏడాదీ సత్తా చాటాలని భావిస్తున్నాడు.