జాతీయ షూటర్ కోణిక లాయక్ ఆత్మహత్య చేసుకుంది. కొన్నిరోజుల క్రితం నటుడు సోనూసూద్ నుంచి ప్రాక్టీస్ కోసం తుపాకీ అందుకున్న ఆమె.. పాపులర్ అయింది. పశ్చిమ బెంగాల్లోని హౌరాలో శిక్షణ తీసుకుంటున్న ఆమె.. తాను ఉంటున్న వుమెన్స్ హాస్టల్ రూమ్లో ఉరేసుకొని మరణించింది. 28 ఏళ్ల కోణిక గదిలో సూసైడ్ నోట్ దొరికినట్లు పోలీసులు తెలిపారు.
తల్లిదండ్రుల కలలను నెరవేర్చలేక పోతున్నందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తోంది. జీవీ మవలాంకర్ ప్రీ-నేషనల్ ఈవెంట్లో ఆమె డిస్క్వాలిఫై అయింది. టార్గెట్ను ట్యాంపర్ చేసిందనే కారణంగా ఆమెను డిస్క్వాలిఫై చేశారు. అప్పటి నుంచి ఆమె బాధలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
హాస్టల్లో తన రూమ్మేట్స్ అందరూ బయటకు వెళ్లిన తర్వాత కోణిక సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోందని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపామని పోలీసులు తెలియజేశారు. ఆమె కుటుంబ సభ్యులు జార్ఖండ్ నుంచి హౌరా వచ్చారని వెల్లడించారు.
సెప్టెంబరు నుంచి ఇప్పటి వరకూ ముగ్గురు జాతీయస్థాయి భారత షూటర్లు ఆత్మహత్య చేసుకున్నారు. కోణిక నాలుగో షూటర్. ఇది భారత షూటింగ్ క్రీడకు మంచిది కాదని క్రీడాకారులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.