
ఖమ్మం సిటీ: ‘తిండి కలిగితే కండ కలుగును. కండ కలవాడేను మనిషోయి’ అని మహాకవి గురజాడ అప్పారావు అన్న మాటలు అక్షర సత్యాలు. ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక శ్రమ తప్పనిసరి. శరీర సౌష్టవాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దుకునేందుకు కండలవీరులు పడే కష్టాలు అన్ని ఇన్ని కావు. రోజుకు గంటల కొద్ది వ్యాయామం చేస్తూ ఉక్కు శరీరం కోసం తాపత్రయ పడుతారు. ఇలా వీళ్లందరూ ఒక్క దగ్గర కలిశారు. ప్రముఖ న్యాయవాది, భారత బాడీబిల్డర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు స్వామి రమేశ్‌కుమార్ ఆధ్వర్యంలో జాతీయ సీనియర్ బాడీబిల్డింగ్ పోటీలకు ఖమ్మం వేదికైంది. దేశం నలుమూలల నుంచి కండలు తిరిగిన యోధుల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. తమ శరీర సౌష్టవాన్ని ప్రదర్శిస్తూ రిఫరీలను మెప్పించేందుకు బాడీ బిల్డర్లు ప్రయత్నించారు. శుక్రవారం తొలి రోజు పోటీలను ప్రముఖ పారిశ్రామిక వేత్త రఘురాంరెడ్డి ప్రారంభించారు. బరువుతో పాటు వ్యక్తిగత ప్రాతిపాదికగా ఎనిమిది విభాగాల్లో పోటీలు నిర్వహించారు. శనివారం జరుగనున్న ఫైనల్స్ కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని విభాగాల్లో అగ్రస్థానంలో నిలిచిన వారిని ‘మిస్టర్ ఇండియా’ చాంపియన్‌షిప్ విజేతలుగా ప్రకటించనున్నారు.