హైదరాబాద్, అక్టోబర్28(నమస్తే తెలంగాణ) : గిరిజన యువత క్రీడల్లో రాణించాలని తెలంగాణ రాష్ట్ర గిరిజన, సాంఘిక, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సూచించారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ, తెలంగాణ రాష్ట్ర గిరిజన సాంసృతిక పరిశోధనా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో హుసేన్సాగర్ వద్ద ఏర్పాటు చేసిన జాతీయ కెనో స్ప్రింట్ చాంపియన్‌షిప్ పోటీలను మంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు గిరిజన యువత స్వావలంబనకు మార్గం చూపుతాయని అన్నారు.
పోటీల్లో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అస్సాం, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, ఆత్రం సకు, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్, సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, కలెక్టర్ హరిచందన, గిరిజన సంక్షేమశాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వరరెడ్డి, గిరిజన సాంసృతిక పరిశోధన శిక్షణ సంస్థ సంచాలకురాలు సముజ్వల, గురుకులాల కార్యదర్శి సీతాలక్ష్మి పాల్గొన్నారు.