హైదరాబాద్, ఆట ప్రతినిధి: కొల్లూరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్(డీపీఎస్) వేదికగా రాష్ట్ర జూనియర్ ఆర్చరీ చాంపియన్‌షిప్ హోరాహోరీగా సాగాయి. ఇండియన్, రికర్వ్, కాంపౌండ్ విభాగాల్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో దాదాపు 200 మందికి పైగా ఆర్చర్లు పోటీపడ్డారు. కాంపౌండ్ విభాగంలో పెద్దపల్లికి చెందిన చికితారావు 697 పాయింట్లతో పసిడి పతకంతో మెరిసింది. ఇదే కేటగిరీలో మానసకు రజతం, శ్రేష్టారెడ్డి కాంస్యం దక్కించుకున్నారు.
జాతీయ ట్రయల్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి ప్రతిష్ఠాత్మక ఆర్చీర ప్రపంచకప్‌నకు ఎంపికైన చికితను రాష్ట్ర ఆర్చరీ సంఘం అధ్యక్షుడు రాజు, డీపీఎస్ కరస్పాండెంట్ పవన్‌కల్యాణ్ సన్మానించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ భవిష్యత్‌లో డీపీఎస్ అకాడమీ ద్వారా మెరికల్లాంటి ఆర్చర్లను అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఎస్ చైర్మన్ భీమ్సేన్, వైస్‌చైర్మన్ ప్రణయ్‌కుమార్, ఆర్చరీ సంఘం కార్యదర్శి అరవింద్ తదితరులు పాల్గొన్నారు.