లండన్ : భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌లో టీ20 ప్రపంచకప్ ఆడబోమని, తటస్థ వేదికలో తమ మ్యాచ్‌లను ఆడించాలని కోరిన బంగ్లాదేశ్‌పై వేటు వేసిన ఐసీసీపై ఇంగ్లండ్ మాజీ సారథి నాసిర్ హుస్సేన్ విమర్శలు గుప్పించాడు. బంగ్లా స్థానంలో భారత జట్టు ఉంటే ఐసీసీ ఇలాగే వ్యవహరించేదా? అని ప్రశ్నించాడు.
ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. “ఒకవేళ బంగ్లా స్థానంలో భారత జట్టు ఉండి ప్రపంచకప్ వంటి పెద్ద టోర్నీకి నెలరోజులు ముందు ఐసీసీతో ‘మా ప్రభుత్వం ఈ దేశంలో వరల్డ్ కప్ ఆడేందుకు సమ్మతించడం లేదు’ అని చెబితే బీసీసీఐపై ఐసీసీ ఇలాగే వ్యవహరించేదా? ‘మీకు నిబంధనలు తెలుసు కదా. దురదృష్టం. మేం మిమ్మల్ని బహిష్కరిస్తున్నాం’ అని చెప్పగలిగేదా?” అని ఘాటు విమర్శలు చేశాడు. బంగ్లాదేశ్, పాకిస్థాన్, భారత్.. ఏ దేశమైనా అన్నింటినీ ఒకేరకంగా చూడాలని నాసిర్ సూచించాడు.