తెలంగాణ గురుకులాలు అద్భుత ఫలితాలను అందిస్తున్నాయి. సీఎం కేసీఆర్ మదిలో నుంచి పుట్టిన గురుకులాలు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయి. చిచ్చరపిడుగుల్లా చదువుల్లోనే కాదు ఆటల్లోనూ పిల్లలు ఇరగదీస్తున్నారు. తాము ఎంచుకున్న క్రీడల్లో ప్రతిభ చాటుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొడుతున్నారు. ఇప్పుడు ఇదే కోవలోకి నిజామాబాద్ గిరిజన రైతు కుటుంబానికి చెందిన గుగులోతు మమత..ప్రతిష్ఠాత్మక ఆసియాగేమ్స్‌కు ఎంపికైంది. జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్‌లో సత్తాచాటుతున్న మమత.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నది. గురుకులాల నుంచి మొదలై అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన మమతను నమస్తే తెలంగాణ పలుకరించింది.
నిజామాబాద్ నుంచి మరో క్రీడా ఆణిముత్యం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే నిఖత్జరీన్, గుగులోతు సౌమ్య, మహమ్మద్ హుసాముద్దీన్ అంతర్జాతీయ వేదికలపై రాష్ట్ర ఖ్యాతిని దశదిశలా విస్తరిస్తుంటే..ఇప్పుడు అదే జిల్లా నుంచి సాఫ్ట్‌బాల్ ప్లేయర్ గుగులోతు మమత దూసుకొచ్చింది. ఆరో తరగతి వరకు తండాలో విద్యనభ్యసించిన మమత.. సాంఘిక సంక్షేమ గురుకులంలో చేరిన తర్వాత తన గతిని మార్చుకుంది. అప్పటి వరకు కబడ్డీ, ఖోఖో, క్రికెట్, అథ్లెటిక్స్ లాంటి ఆటలను చూసిన మమత..సాఫ్ట్‌బాల్ పట్ల ఆకర్షితురాలైంది. మిగతా క్రీడలతో పోలిస్తే కొత్తగా అనిపించిన సాఫ్ట్‌బాల్‌పై మక్కువ పెంచుకున్న మనసు పెట్టి నేర్చుకుంది. సుద్దపల్లి గురుకుల సాఫ్ట్‌బాల్ అకాడమీలో ఈ గిరిజన తేజం ఓనమాలు నేర్చుకుంది. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన మమత అంచలంచెలుగా ఎదిగింది. ఇప్పటి వరకు 18సార్లు జాతీయ స్థాయిలో ఆడిన మమత తాజాగా ఆసియాగేమ్స్‌కు ఎంపికై తన సత్తాఏంటో చూపెట్టింది. రాష్ట్రం నుంచి భారత సాఫ్ట్‌బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి ప్లేయర్‌గా అరుదైన ఘనత సొంతం చేసుకుంది.
ఆసియాగేమ్స్ ఎంపికపై స్పందన?
ప్రతిష్ఠాత్మక ఆసియాగేమ్స్‌కు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. మామూలు తండా నుంచి ప్రతిష్ఠాత్మక ఆసియాగేమ్స్‌కు ఎంపిక కావడం మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా జాతీయ స్థాయిలో సత్తాచాటుతూ ఇక్కడికి చేరుకున్నాను.
ఎంపిక ఎలా జరిగింది?
ఢిల్లీ వేదికగా జూన్ 20 నుంచి జూలై 8 వరకు జాతీయ సాఫ్ట్‌బాల్ శిబిరం జరిగింది. ఇందులో వివిధ రాష్ర్టాల నుంచి మొత్తం 36 మంది ప్లేయర్లు పాల్గొన్నారు. ఇందులో నుంచి ప్లేయర్ల ప్రదర్శనతో పాటు నిలకడను అంచనా వేస్తూ ఆసియాగేమ్స్‌కు జట్టును ఎంపిక చేశారు. ప్రస్తుతం నేను క్యాచర్‌గా కొనసాగుతున్నాను. ఆసియాగేమ్స్‌లో సత్తాచాటేందుకు పట్టుదలతో ఉన్నాను.
జాతీయ స్థాయి ప్రాతినిధ్యంపై?
స్కూల్ స్థాయి నుంచే సాఫ్ట్‌బాల్‌లో శిక్షణ తీసుకున్నాను. మొదట పంజాబ్‌లో జరిగిన మినీ జూనియర్(అండర్-13) జాతీయ చాంపియన్‌షిప్‌లో బెస్ట్ క్యాచర్‌గా అవార్డు అందుకున్నాను. టోర్నీటోర్నీకి మెరుగయ్యాను. మొత్తం 18 జాతీయ స్థాయి టోర్నీల్లో ఇప్పటి వరకు ఏడు పతకాలు సొంతం చేసుకున్నాను. 2019లో చైనాలో జరిగిన జూనియర్ ఇంటర్నేషనల్ టోర్నీలో దేశానికి ప్రాతినిధ్యం వహించాను.
కుటుంబ నేపథ్యం ఏంటీ?
మాది నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండం డీబీ తండా. సాధారణ గిరిజన వ్యవసాయ కుటుంబం. తండ్రి హరిచంద్, తల్లి శాంతి వ్యవసాయం చేస్తారు. నాకు అన్నయ్య, చెల్లి ఉన్నారు.
సాఫ్ట్‌బాల్‌లో ప్రోత్సాహం ఎలా ఉంది?
చిన్పప్పటి నుంచి సాఫ్ట్‌బాల్‌పై మక్కువ పెంచుకున్న నాకు తల్లిదండ్రులు వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా.. నాన్న హరిచంద్ కష్టనష్టాలకు ఓర్చుకుంటూ టోర్నీలకు పంపించారు. గురుకులంలో అన్ని రకాల సౌకర్యాలకు తోడు టీచర్ల మద్దతు మరువలేనిది. ప్రతీ విషయంలో కేరింగ్ తీసుకున్నారు. ఈ ప్రయాణంలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు. ప్రభుత్వం నుంచి మరింత ప్రోత్సాహం లభిస్తే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తానన్న ఆత్మవిశ్వాసం నాకుంది.
శభాష్ మమత
ఆసియాగేమ్స్‌కు ఎంపికైన ఎస్సీ గురుకుల విద్యార్థిని మమతను మంత్రి కొప్పుల ఈశ్వర్ అభినందించారు. ఆసియా క్రీడల్లో విజయంతో తెలంగాణ గురుకులాల సత్తాచాటాలని ఆకాంక్షించారు. గురుకులాల కార్యదర్శి నవీన్ నికోలస్ మమతకు శుభాకాంక్షలు తెలిపారు.