పల్లెటూరి పిల్లగాడు..ప్రకృతితో మమేకమయ్యేవాడు. కూలీ పనిచేస్తూ పొట్ట నింపుకునే యువకుడు. చెక్కుచెదరని గురితో ఔరా అనిపించేవాడు. సాధు జంతువుల స్నేహితుడు. ఈల వేస్తే కుక్కలు ఎక్కడున్నా.. అతడి దగ్గర చేరుకునే అప్యాయత అతడి సొంతం. వేగంతో పోటీపడే కుందేళ్లు, పిట్టలను గురిచూసి కొట్టడంలో అతడ్ని మించినోడు లేడు. గురిచూసి రాయి విసిరాడంటే కుందేళ్ల కాళ్లకు బ్రేక్ పడాల్సిందే. అతడే నల్లగొండ ఆణిముత్యం పల్లేటి వెంకటేశ్. తన గ్రామానికే చెందిన విజేందర్‌రెడ్డి, కోచ్ సందీప్ ప్రోత్సాహంతో అంచలంచెలుగా ఎదిగాడు. సానబెట్టిన వజ్రంలా షూటింగ్లో అభినవ ఏకలవ్యుడిలా అదరగొడుతున్నాడు. రాష్ట్ర స్థాయి టోర్నీ రైఫిల్ విభాగంలో వెండి వెలుగులు విరజిమ్మాడు. వెన్నుతట్టి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తానంటూ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం ఆర్థిక సాయమందిస్తే జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో పతకాల పంట పండిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న వెంకటేశ్‌తో ఇంటర్వ్యూ..
సిటీబ్యూరో, ఆగస్టు 5 ( నమస్తే తెలంగాణ ): పల్లెటూరి వాతావరణంలో పెరిగిన యువకుడు షూటింగ్లో అంచనాలకు మించి రాణిస్తున్నాడు. పుట్టుకతో వచ్చిన విద్యకు ప్రాణ ప్రతిష్ఠ చేస్తూ ఎంచుకున్న కెరీర్లో సంచనాలు సృష్టిస్తున్నాడు. పొట్ట కూటి కోసం కూలీ పనిచేసుకుంటూ రోజులు వెల్లదీసే కుటుంబం నుంచి వచ్చినా..ఎక్కడా తగ్గకుండా షూటింగ్లో అదరగొడుతున్నాడు. ఏకలవ్యుడి శిష్యునిలా కచ్చితమైన గురితో పతకాలు కొల్లగొడుతున్నాడు. దేవేందర్‌రెడ్డి ఇచ్చిన అండ, కోచ్ సందీప్ శిక్షణలో రోజురోజుకు రాటుదేలుతూ మేటి షూటర్‌గా ఎదిగేందుకు అడుగులు వేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర స్థాయి షూటింగ్ టోర్నీలో రజత పతకం దక్కించుకుని సత్తాచాటాడు. ప్రత్యుర్థులకు దీటైన సవాలు విసురుతూ పాయింట్ తేడాతో పసిడి పతకాన్ని చేజార్చుకున్నాడు. అయినా తొణకని ఆత్మవిశ్వాసంతో ఉన్న వెంకటేశ్.. రానున్న టోర్నీల్లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటానని పేర్కొన్నాడు. ఈ విజయాన్ని తన గురువు సందీప్, ప్రతిభను గుర్తించి చేదోడుగా నిలిచిన విజేందర్‌రెడ్డికి అంకితమిస్తున్నట్టు వెంకట్ తెలిపాడు. రైఫిల్ షూటింగ్ పోటీల్లో లక్ష్యం 600 కు 570 పాయింట్లు సాధించి అందరిని విస్మయానికి గురిచేసిన ఈ షూటర్‌ను నమస్తే తెలంగాణ పలకరించింది.
వాచ్‌మన్‌గా పనిజేస్తూ..!!
నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం తెలుగుపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్ ఇంటర్ చదివాడు. నిరుపేద కుటుంబం. పై చదువులు చదివితే కుటుంబం నడిచే పరిస్థితి లేదు. దీంతో మధ్యలోనే చదువు ఆపేశాడు. కూలీ పనిచేస్తూ కాలం వెల్లదీశాడు. అతడిలోని ప్రతిభను అదే గ్రామానికి చెందిన హైదరాబాద్‌లో స్థిరపడిన విజేందర్‌రెడ్డి గుర్తించాడు. కరోనా కష్టకాలంలో ఊరెళ్లిన విజేందర్‌రెడ్డి అతడి గురించి తెలుసుకుని పట్నం రావాల్సిందిగా చెప్పాడు. “నేనా పటేలా..! పట్నమా! అమ్మో అంత పెద్ద ఊళ్లో నేనేం చేస్తా. నాకేం తెల్వదు. నాకు భయం. నేను రానూ పటేలా.” అని ఇంటికి వెళ్లిపోయాడు. మరునాడు వారి తల్లిదండ్రులను, అతడిని పిలిపించి వారికి నచ్చజెప్పి.. అంతా తాను చూసుకుంటానని అతడిని నగరానికి తీసుకొచ్చారు. అతడి ప్రతిభను విజేందర్‌రెడ్డి తన స్నేహితుడితో చెప్పగా.. అతడిచ్చిన సలహా మేరకు హెచ్‌సీయూ ఉన్న తెలంగాణ రైఫిల్ అసోసియేషన్‌లో వెంకటేశ్‌ను చేర్పించారు. 2020లో సరిగ్గా కరోనా కష్టకాలంలో అతడు రైఫిల్ షూటింగ్లో దిగాడు. కేవలం రెండేండ్ల వ్యవధిలో రజతం సాధించే స్థాయికి ఎదిగాడు. ఈ క్రమంలో అతడు తన ఖర్చుల కోసం అదే కోచ్ కార్యాలయానికి వాచ్‌మన్‌గా కూడా పనిచేశాడు.
రజతం గెలిచి..
అంతా కొత్త. సహచర షూటర్లు తను వినని భాషల్లో మాట్లాడుకుంటున్నారు. షూటింగ్‌కు సంబంధించిన టెక్నాలజీ కూడా తెలియని అతడిని కోచ్ సందీప్ చక్కగా తీర్చిదిద్దాడు. తొలుత మద్రాస్, అహ్మదాబాద్, భోపాల్‌ల్లో జరిగిన రైఫిల్ షూటింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొని మెప్పించాడు. రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో రజతం సాధించాడు.
వెంకటేశ్ రజత గురి తెలంగాణ షూటింగ్ చాంపియన్‌షిప్
కొండాపూర్: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్) ఆధ్వర్యంలో జరిగిన 8వ తెలంగాణ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో యువ షూటర్ పల్లేటి వెంకటేష్ సత్తాచాటాడు. శుక్రవారం జరిగిన పురుషుల 50మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో రజత పతకంతో మెరిశాడు. చెక్కుచెదరని గురితో ఆకట్టుకున్న ఈ నల్లగొండ కుర్రాడు(570) పాయింట్ తేడాతో స్వర్ణ పతకాన్ని కోల్పోయాడు. మహమ్మద్ అబ్దుల్ ఖాలిక్(571), ఓం దీప్‌సింగ్ తుల్జారాం(568) వరుసగా పసిడి, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. మరోవైపు 10మీటర్ల రైఫిల్‌లో సాయికుమార్ స్వర్ణం, జూనియర్స్ 50మీటర్ల రైఫిల్ ప్రోన్ కేటగిరీలో పసిడి, 50 మీటర్ల ఓపెన్ సైట్ రైఫిల్‌లో రవికుమార్ స్వర్ణం కైవసం చేసుకున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 700 మంది షూటర్లు పోటీపడ్డారు. గతేడాది కంటే రెట్టింపు సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.
మట్టిలో మాణిక్యం వెంకటేశ్
వెంకటేశ్ చిన్నప్పటి నుంచి చురుకుగా ఉండే వ్యక్తి. అతడి ప్రతిభను చూసి నేను ఆశ్చర్యపోయాను. పరిగెత్తే కుందేలును రాయితో గురి తప్పకుండా కొట్టేవాడు. ఒక్కటంటే ఏమో అనుకోవచ్చు. అలా ఎన్ని కుందేళ్లు పరిగెత్తినా తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించేవాడు. అప్పుడే నాకు అనిపించింది. అలాంటి అసమాన ప్రతిభ ఊర్లో కనుమరుగు కాకూడదనుకున్నాను. ఆ టాలెంట్‌ను సరైన దారిలో పెట్టాలని నిర్ణయించుకున్నాను. అతడిని నగరానికి తీసుకొచ్చి శిక్షణ ఇప్పించాను. ఈ రోజు వెంకట్ షూటింగ్ పోటీల్లో రజతం సాధించడం చాలా ఆనందాన్నిస్తుంది.
-తిప్పర్తి విజేందర్ రెడ్డి
వారికి రుణపడి ఉంటా
ఎక్కడో ఉండిపోవాల్సిన నేను ఈ రోజు హైదరాబాద్ గడ్డపై నిల్చున్నానంటే అదృష్టంగా భావిస్తున్నాను. మా దైవసమానులు పటేల్, మా కోచ్ అందుకు కారణం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఏలాగైనా స్వర్న పతకం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. మరింత కష్టపడి పనిచేస్తాను. అమ్మ, నాన్నల ప్రోత్సాహం మరవలేనిది.
–వెంకటేశ్
సాయమందిస్తే సత్తాచాటుతా..
ప్రభుత్వం ఆర్థిక సాయమందిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయి టోర్నీల్లో సత్తాచాటుతానని వెంకటేశ్ పేర్కొన్నాడు. పేద కుటుంబానికి చెందిన తాను ఈ స్థాయికి చేరుకునేందుకు చాలా కష్టపడ్డాను. సరైన సహకారం లభిస్తే భవిష్యత్‌లో రాష్ట్రం తరఫున షూటింగ్లో పతకాల పంట పండిస్తాను.