ఢాకా : ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ రెహ్మాన్ విడుదల అనంతరం జరుగుతున్న పరిణామాలు ఆ దేశ క్రికెట్ బోర్డుకే గాక ఆటగాళ్లకూ కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయి. తమ దేశ గౌరవాన్ని తాకట్టుపెట్టి భారత్‌లో టీ20 ప్రపంచకప్ ఆడబోమని ఆ బోర్డు మొండికేస్తున్న నేపథ్యంలో ఆ జట్టు ఆటగాళ్లకు స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్న పలు సంస్థలు వారితో కాంట్రాక్టులను రద్దు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
లిటన్ దాస్, మొమినుల్ హక్, యాసిర్ రబ్బి వంటి బ్యాటర్లకు బ్యాట్ స్పాన్సర్‌గా ఉన్న భారత కంపెనీ ఎస్జీ (సాన్స్పరీల్స్ గ్రీన్లాండ్స్).. వారితో స్పాన్సర్‌షిప్‌ను పునరుద్ధరించే అవకాశం లేదని ఏజెంట్లతో ఇప్పటికే అనధికారిక సమాచారం పంపినట్టు తెలుస్తున్నది. ఒకవేళ ఎస్జీ గనక ఈ నిర్ణయం తీసుకుంటే వారితో కాంట్రాక్టులున్న మిగిలిన సంస్థలూ ఇదే బాటలో వెళ్లే అవకాశం లేకపోలేదు.