Duleep Trophy : దేశవాళీ క్రికెట్లో యువకెరటం ముషీర్ ఖాన్(Musheer Khan), పేసర్ నవ్‌దీప్ సైనీ(Navdeep Saini)లు చరిత్ర సృష్టించారు. దులీప్ ట్రోఫీలో అసాధారణ బ్యాటింగ్‌తో ‘ఇండియా బీ’ని ఆదుకున్న ఈ ఇద్దరూ రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఇండియా ఏ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ క్రీజులో పాతుకుపోయిన ముషీర్, సైనీలు 8వ వికెట్‌కు 205 పరుగులు జోడించారు. తద్వారా దులీప్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక భాగస్వామ్యం నమోదు చేశారు. దాంతో, 2010లో వెస్ట్ జోన్ ఆటగాళ్లు అభిషేక్ నాయర్(Abhishek Nair), రమేశ్ పవార్(Ramesh Powar)లు నెలకొల్పిన 196 పరుగుల రికార్డు బద్ధలైంది.
తొలి రోజు 92 పరుగులకే 4 వికెట్లు పడిన దశలో ఇండియా బీ ఆలౌట్ అవ్వడం పక్కా అనుకున్నారంతా. కానీ, ముషీర్ ఖాన్(181: 373 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్సర్లు) కళాత్మక షాట్లతో అలరిస్తూ ఇండియా ఏ బౌలర్లను ఆత్మరక్షణలో పడేశాడు. చెక్కుచెదరని ఏకాగ్రతతో, అద్భుతమైన ఫుట్‌వర్క్‌తో ముషీర్ ఓ వైపు బౌండరీలో విరుచుకుపడగా.. మరో ఎండ్‌లో నవ్‌దీప్ సైనీ(56) చక్కని సహకారం అందించాడు. ముషీర్ తన స్క్రోక్ ప్లేతో స్కోర్ బోర్డును ఉరికించి సెంచరీతో గర్జించాడు. దాంతో, తొలి రోజు ఇండియా బీ జట్టు 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేయగలిగింది.
Navdeep Saini has brought up his 50 🙌
What a crucial knock this has been 👌#DuleepTrophy | @IDFCFIRSTBank
Follow the match ▶️ https://t.co/eQyu38Erb1 pic.twitter.com/Lqlcn7hPab
— BCCI Domestic (@BCCIdomestic) September 6, 2024
రెండో రోజు కూడా ముషీర్, సైనీలు పట్టువిడువలేదు. చివరకు 205 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీని కుల్దీప్ యాదవ్ విడదీశాడు. చక్కని బంతితో ముషీర్‌ను బోల్తా కొట్టించాడు. ఆ కాసేపటికే అర్ధ సెంచరీ బాదిన సైనీని ఆకాశ్ దీప్ పెలియన్ పంపాడు. దాంతో, ఇండియా బీ ఇన్నింగ్స్ 321 పరుగుల వద్ద ముగిసింది. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన ఇండియా ఏ జట్టు 30 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది.