ఢాకా: బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్(Shakib Al Hasan)పై మర్డర్ కేసు నమోదు అయ్యింది. రఫీకుల్ ఇస్లామ్ ఈ కేసు దాఖలు చేశారు. ఆగస్టు 7వ తేదీన జరిగిన ర్యాలీలో రఫీకుల్ కుమారుడు రూబెల్ మరణించాడు. అడోబార్ రింగు రోడ్డులో జరిగిన ర్యాలీ సమయంలో కాల్పుల్లో రూబెల్ మృతిచెందాడు. అయితే ఈ ఘటనకు చెందిన అడోబార్ పోలీసు స్టేషన్ కేసు నమోదు చేశారు. ఆ కేసులో 28వ నిందితుడిగా షకీబ్ పేరును చేర్చారు. బంగ్లా పాపులర్ నటుడు ఫెర్దౌస్ అహ్మద్‌ను 55వ నిందితుడిగా చేర్చారు. ఈ ఇద్దరూ అవామీ లీగ్ పార్టీకి చెందిన మాజీ ఎంపీలు.
రూబెల్ మృతి కేసులో మొత్తం 154 మంది నిందితుల్ని చేర్చారు. దాంట్లో ప్రధాని షేక్ హసీనా కూడా ఉన్నారు. ఈ కేసులో మరో 500 మంది గుర్తు తెలియని వ్యక్తుల్ని నిందితులుగా చేర్చారు. మరో వైపు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా ఫారూక్ అహ్మద్ పేరును ప్రకటించారు. ఆ పోస్టుకు నజ్ముల్ హసన్ రాజీనామా చేశారు. హసీనా ప్రభుత్వంలో క్రీడామంత్రిగా కూడా నజ్ముల్ చేశారు.
హసీనాకు వ్యతిరేకంగా సాగిన నెల రోజుల నిరసన ప్రదర్శనల్లో .. సుమారు 450 మంది మరణించారు.