లక్నో: ముంబై యువ ఆల్‌రౌండర్ ముషీర్‌ఖాన్ తృటిలో పెను ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. శనివారం తన స్వస్థలం అజంఘర్ నుంచి లక్నోకు కారులో బయల్దేరిన ముషీర్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. పూర్వంచల్ ఎక్స్‌ప్రెస్ హైవేపై రోడ్డు డివైడర్‌ను వేగంగా ఢీకొట్టిన ముషీర్ ఖాన్ కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా ముషీర్‌తో పాటు తండ్రి నౌషద్‌ఖాన్ తీవ్ర గాయాల పాలయ్యారు. వెంటనే స్పందించిన స్థానికులు దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ముషీర్ ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మేదాంత దవాఖాన ఆర్థోపెడిక్ డైరెక్టర్ ధర్మేంద్రసింగ్ పేర్కొన్నారు. ముషీర్ ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు బీసీసీఐతో పాటు ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎమ్సీఏ) ఒక ప్రకటనలో పేర్కొంది. అతను కొద్దిగా కుదురుకున్న తర్వాత ముంబైకి తరలించి మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపా రు. ఇదిలా ఉంటే రోడ్డు ప్రమాదం కారణంగా త్వరలో జరుగనున్న ఇరానీ కప్‌తో పాటు రంజీ ట్రోఫీలో కొన్ని మ్యాచ్‌లకు ముషీర్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.