చావోరేవో పోరులో ముంబై ఇండియన్స్ విజృంభించింది. బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై ముంబై పేసర్లు బంతులకు బదులు నిప్పులు చెరిగితే.. బ్యాటింగ్‌లో యువ ఆటగాడు ఇషాన్ కిషన్ దడదడలాడించాడు. ఫలితంగా రాజస్థాన్ రాయల్స్‌పై గ్రాండ్ విక్టరీ కొట్టిన రోహిత్ సేన ప్లే ఆఫ్స్ దిశగా ముందడుగేసింది.భారీ విజయంతో ముంబై రన్‌రేట్ మెరుగుపర్చుకుంటే.. ఈ ఓటమితో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్‌కు దూరమైంది!
షార్జా: ముందంజ వేయాలంటే తప్పక నెగ్గాల్సిన పోరులో ముంబై సత్తాచాటింది. పేసర్ల విజృంభణకు టాపార్డర్ మెరుపులు తోడవడంతో మంగళవారం జరిగిన ఏకపక్ష పోరులో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ను.. ముంబై పేసర్లు ఉక్కిరిబిక్కిరి చేశారు. నాథన్ కౌల్టర్‌నైల్ (4/14), నీషమ్ (3/12), బుమ్రా (2/14) ధాటికి రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 90 పరుగులకు పరిమితమైంది. ఎవిన్ లూయిస్ (24) టాప్ స్కోరర్ కాగా.. రాయల్స్ ఆటగాళ్లంతా కలిసి ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లే కొట్టారు. గత మ్యాచ్‌లో చెన్నై బౌలర్లను చెడుగుడాడుకున్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (12) మూడు ఫోర్లు కొట్టి పెవిలియన్ చేరగా.. కెప్టెన్ సంజూ శాంసన్ (3), శివం దూబే (3), గ్లెన్ ఫిలిప్స్ (4), డేవిడ్ మిల్లర్ (15), తెవాటియా (12) ప్రభావం చూపలేకపోయారు. ఆరో ఓవర్ తొలి బంతికి ఫోర్ నమోదయ్యాక.. 19వ ఓవర్ వరకు ఒక్క బౌండ్రీ నమోదు కాలేదంటేనే రాజస్థాన్ ఇన్నింగ్స్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. అనంతరం లక్ష్యఛేదనలో ఇషాన్ కిషన్ (25 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ముంబై 8.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (22; ఒక ఫోర్, 2 సిక్సర్లు), సూర్యకుమార్ (13; 3 ఫోర్లు) ఉన్నంతసేపు వేగంగా ఆడారు. రాజస్థాన్ బౌలర్లలో ముస్తఫిజుర్, సకారియా చెరో వికెట్ పడగొట్టారు. కౌల్టర్‌నైల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
రాజస్థాన్: లూయిస్ (ఎల్బీ) బుమ్రా 24, జైస్వాల్ (సి) ఇషాన్ (బి) కౌల్టర్‌నైల్ 12, శాంసన్ (సి) జయంత్ (బి) నీషమ్ 3, దూబే (బి) నీషమ్ 3, ఫిలిప్స్ (బి) కౌల్టర్‌నైల్ 4, మిల్లర్ (ఎల్బీ) కౌల్టర్‌నైల్ 15, తెవాటియా (సి) ఇషాన్ (బి) నీషమ్ 12, గోపాల్ (సి) ఇషాన్ (బి) బుమ్రా 0, సకారియా (బి) కౌల్టర్‌నైల్ 6, కుల్దీప్ (నాటౌట్) 0, ముస్తఫిజుర్ (నాటౌట్) 8, ఎక్స్‌ట్రాలు: 3, మొత్తం: 90/9, వికెట్ల పతనం: 1-27, 2-41, 3-41,4-48, 5-50, 6-71, 7-74, 8-76, 9-82, బౌలింగ్: బౌల్ట్ 4-0-24-0, జయంత్ 2-0-17-0, బుమ్రా 4-0-14-2,కౌల్టర్‌నైల్ 4-0-14-4, నీషమ్ 4-0-12-3, పొలార్డ్ 2-0-9-0.
ముంబై: రోహిత్ (సి) జైస్వాల్ (బి) సకారియా 22, ఇషాన్ (నాటౌట్) 50, సూర్యకుమార్ (సి) (సబ్) లోమ్రర్ (బి) ముస్తఫిజుర్ 13, హార్దిక్ (నాటౌట్) 5, ఎక్స్‌ట్రాలు: 4, మొత్తం: 8.2 ఓవర్లలో 94/2. వికెట్ల పతనం: 1-23, 2-56, బౌలింగ్: ముస్తఫిజుర్ 2.2-0-32-1, సకారియా 3-1-36-1, గోపాల్ 1-0-9-0, కుల్దీప్ 2-0-16-0.