ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జైట్టెన ముంబై ఇండియన్స్ తాజా సీజన్లో బోణీ కొట్టింది. గత రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన రోహిత్ సేన.. ఢిల్లీతో పోరులో సమిష్టిగా సత్తాచాటింది. వెటరన్ స్పిన్నర్ పియూష్ చావ్లా, బెహ్రన్‌డార్ఫ్ ధాటికి ఢిల్లీ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. డేవిడ్ వార్నర్ తనకు అలవాటైన శైలిలో నిదానంగా అర్ధశతకం నమోదు చేసుకోగా.. అక్షర్ పటేల్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఛేదనలో కెప్టెన్ రోహిత్‌తో పాటు తెలంగాణ ప్లేయర్ తిలక్ వర్మ రాణించడంతో ముంబై గెలుపు గీత దాటింది.
న్యూఢిల్లీ: బౌలర్ల బాధ్యతాయుత ప్రదర్శనకు.. బ్యాటర్ల సహకారం తోడవడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్లో ముంబై ఇండియన్స్ బోణీకొట్టింది. మంగళవారం జరిగిన పోరులో ముంబై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుచేసింది. తాజా సీజన్లో ఢిల్లీకి ఇది వరుసగా నాలుగో పరాజయం కావడం గమనార్హం. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 19.4 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (47 బంతుల్లో 51; 6 ఫోర్లు) తాజా సీజన్లో మూడో హాఫ్‌సెంచరీ నమోదు చేసుకున్నా.. స్లో స్ట్రయిక్‌రేట్ కారణంగా విమర్శల పాలవగా.. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (25 బంతుల్లో 54; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) దంచికొట్టాడు. తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా, జాసెన్ బెహ్రన్‌డార్ఫ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 20 ఓవర్లలో 4 వికెట్లకు 173 రన్స్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (45 బంతుల్లో 65; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చక్కటి అర్ధశతకంతో లయ అందుకోగా.. యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ (31; 6 ఫోర్లు), తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మ (28 బంతుల్లో 41; ఒక ఫోర్, 4 సిక్సర్లు) రాణించారు. సూర్యకుమార్ (0) మరోసారి నిరాశ పరిచాడు. ఆఖర్లో ఉత్కంఠ నెలకొన్నా.. కామెరూన్ గ్రీన్ (17 నాటౌట్), టిమ్ డేవిడ్ (13 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. రోహిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా బుధవారం జరుగనున్న పోరులో చెన్నై సూపర్ కింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి మంచి ఆరంభం లభించేటట్లే కనిపించింది. గత మ్యాచ్‌ల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన ఓపెనర్ పృథ్వీ షా (15; 3 ఫోర్లు) ఉన్నంతసేపు ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. మరో ఎండ్‌లో వార్నర్ కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడటంతో ఢిల్లీ సులువుగా పరుగులు రాబట్టింది. కుదురుకున్నారనుకుంటున్న సమయంలో పృథ్వీ ఔట్ కాగా.. మనీశ్ పాండే (26; 5 ఫోర్లు) పర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో ముంబై స్పిన్నర్లు పట్టుబిగించగా.. ఢిల్లీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. పాండేతో పాటు అండర్ -19 ప్రపంచకప్ హీరో, అరంగేట్ర ఆటగాడు యష్ ధుల్ (2), రావ్మన్ పావెల్ (4), లలిత్ యాదవ్ (2) విఫలమవడంతో క్యాపిటల్స్ 98/5తో నిలిచింది. ఈ దశలో కెప్టెన్ వార్నర్‌కు జత కలిసిన అక్షర్ బాదుడే పరమావధిగా రెచ్చిపోయాడు. అప్పటికే వార్నర్ కూడా ఫిఫ్టీ పూర్తవడంతో ఢిల్లీ మరింత స్కోరు చేసేలా కనిపించింది. అయితే బెహ్రన్‌డార్ప్ వేసిన 19వ ఓవర్లో ఢిల్లీ నాలుగు వికెట్లు కోల్పోయింది. ఫుల్ జోష్‌లో ఉన్న అక్షర్ తొలి బంతికి క్యాచ్ ఔట్ కాగా.. వార్నర్ అతడిని అనుసరించాడు. మధ్యలో కుల్దీప్ యాదవ్ (0) రనౌట్ కాగా.. చివరి బంతికి అభిషేక్ పొరెల్ (1) కూడా వెనుదిరిగాడు.
ఢిల్లీ: 19.4 ఓవర్లలో 172 ఆలౌట్ (అక్షర్ 54, వార్నర్ 51; చావ్లా 3/22, బెహ్రన్‌డార్ఫ్ 3/23), ముంబై: 20 ఓవర్లలో 173/4 (రోహిత్ 65, తిలక్ 41; ముఖేశ్ 2/30).