Milind Rege : ముంబై రంజీ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌ను ఆ రాష్ట్ర చీఫ్ సెలక్టర్ మిలింద్ రెగే విమర్శించాడు. సెలక్షన్ కమిటీని విమర్శిచడం వల్ల సర్ఫరాజ్‌కు ఒనగూరేది ఏం లేదని, అతను ఆటపై దృష్టి పెట్టాలని హితవు పలికాడు. ‘సెలక్షన్ కమిటీని విమర్శిచడం వల్ల సర్ఫరాజ్‌కు ఏమంత ఉపయోగం ఉండదు. అతను భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. అందులో సందేహం లేదు. అతను సెలక్షన్ ప్రక్రియను తప్పు పట్టడం మానేసి, ఆటపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే.. అవకాశం ఉన్నప్పుడు కచ్చితంగా అతడిని ఎంపిక చేస్తారని అనుకుంటున్నా. అయితే.. ప్రస్తుతానికి జట్టులో బ్యాటింగ్ లైనప్ నిండుగా ఉంది. అతనికి స్థానం లేదు’ అని మిలింద్ తెలిపాడు.
రంజీల్లో పరుగుల వరద..
ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు తనను ఎంపిక చేయకపోవడం పట్ల సర్ఫరాజ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఈమధ్యే మీడియాతో మాట్లాడుతూ… టెస్టు సిరీస్‌కు ఎంపికకాక పోవడంతో కుంగిపోయాను. రంజీల్లో పరుగులు సాధిస్తున్నా కూడా ఎంపిక కాకుంటే ఎవరికైనా అలానే ఉంటుంది. నేను కూడా మనిషినే. నాకు ఎమోషన్స్ ఉంటాయి. అయితే.. నాన్నతో మాట్లాడాక మనసు తేలికపడింది అని సర్ఫరాజ్ స్పందించాడు. రంజీల్లో గత రెండు సీజన్లలో అతను పరుగుల వరద పారించాడు. 12 మ్యాచుల్లో 1,910 రన్స్ చేశాడు. వీటిలో 7 శతకాలు ఉన్నాయి. ఈ ఫార్మాట్లో రికార్డులు బద్ధలు కొడుతున్న సర్ఫరాజ్ ఈసారి టెస్టు జట్టకు సెలక్ట్ అవుతాడని మాజీలు అనుకున్నారు.
కానీ,.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదటి రెండు టెస్టులకు ప్రకటించిన జట్టులో అనూహ్యంగా ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లను బీసీసీఐ ఎంపిక చేసింది. దాంతో, టెస్టు సెలక్షన్‌కు రంజీ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోవాలని మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ కూడా బీసీసీఐ తీరును తప్పుబట్టాడు. రంజీల్లో అదరగొడుతున్న ఆటగాళ్లను జాతీయ జట్టులోకి తీసుకోకపోవడం అనేది అవమానకరమని, అమోదయోగ్యం కాదని అతను తెలిపాడు.