సొంతగడ్డపై దంచికొట్టిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్లో వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వీరబాదుడుకు టాపార్డర్ సహకారం తోడవడంతో ముంబై అలవోకగా విజయం సాధించగా.. వెంకటేశ్ అయ్యర్ వీరోచిత శతకం కోల్‌కతాను గెలిపించలేకపోయింది. స్టేడియం మొత్తం నీలి రంగు పులుముకోగా.. ఈ మ్యాచ్‌తో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు.
ముంబై: బౌలర్ల పట్టుదలకు బ్యాటర్ల జోరు తోడవడంతో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది. ఆదివారం డబుల్ హెడర్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై 5 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. వెంకటేశ్ (51 బంతుల్లో 104; 6 ఫోర్లు, 9 సిక్సర్లు) సెంచరీతో వాంఖడే స్టేడియంను హోరెత్తించగా.. అతడికి సహచరుల నుంచి సహకారం దక్కలేదు. ఈ సీజన్లో ఇది రెండో శతకం కాగా.. అయ్యర్‌కు ఐపీఎల్లో అతడికిదే అత్యధిక స్కోరు. ముంబై బౌలర్లలో హృతిక్ షోకీన్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 17.4 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (25 బంతుల్లో 58; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు
అర్ధశతకం సాధించగా.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ (20; ఒక ఫోర్, 2 సిక్సర్లు) స్టాండిన్ కెప్టెన్ సూర్యకుమార్ (25 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మ (30), టిమ్ డేవిడ్ (24 నాటౌట్) రాణించారు. వెంకటేశ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ముంబై స్టాండిన్ కెప్టెన్ సూర్యకు రూ.12 లక్షల జరిమానా పడింది.
ఐపీఎల్లో ఆడిన తండ్రీకొడుకులుగా సచిన్ టెండూల్కర్, అర్జున్ టెండూల్కర్ రికార్డుల్లోకెక్కారు. సచిన్ 2008 నుంచి 2013 వరకు ముంబైకి ప్రాతినిధ్యం వహించగా.. 2021లో ముంబై జట్టు కనీస ధర రూ. 20 లక్షలకు అర్జున్ను కొనుగోలు చేసుకుంది.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. గత రెండు సీజన్లుగా ముంబై ఇండియన్స్ జట్టుతో కొనసాగుతున్న ఈ లెఫ్టార్మ్ ఆల్‌రౌండర్ ఎట్టకేలకు తొలి మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న ముంబై కొత్త బంతిని ఈ 23 ఏండ్ల ఆల్‌రౌండర్ చేతిలో పెట్టింది. తొలి స్పెల్‌లో రెండు ఓవర్లు వేసిన అర్జున్ లైన్ అండ్ లెంగ్త్‌తో ఆకట్టుకున్నాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు అర్జున్‌కు రోహిత్ శర్మ జట్టు క్యాప్ అందించాడు.
కోల్‌కతా: 185/6 (వెంకటేశ్ 104, రస్సెల్ 21; షోకీన్ 2/34, చావ్లా 1/19),
ముంబై: 17.4 ఓవర్లలో 186/5 (ఇషాన్ 58, సూర్యకుమార్ 43; సుయాశ్ 2/27).