ముంబై : ఐపీఎల్లో తొలి మ్యాచ్‌ను ఓటమితో ఆరంభించే ముంబై ఇండియన్స్ ఈసారి రూటు మార్చింది. 2012 (చెన్నై సూపర్ కింగ్స్‌పై) తర్వాత ఆ జట్టు మొదటిసారి సీజన్ ఆరంభ మ్యాచ్‌ను గెలుచుకుని వరుసగా 13 ఓటముల పరంపరకు ముగింపు పలికింది. ఆదివారం వాంఖడేలో హార్ధిక్ సేన.. 6 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)ను చిత్తుచేసి గెలిచి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. బంతితో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా ప్రత్యర్థి నిర్దేశించిన 221 పరుగుల లక్ష్యాన్ని మరో 5 బంతులుండగానే బాదేసి రికార్డు విజయాన్ని నమోదుచేసింది. ర్యాన్ రికెల్టన్ (43 బంతుల్లో 81, 4 ఫోర్లు, 8 సిక్స్‌లు), ‘ముంబై చ రాజా’ రోహిత్ శర్మ (38 బంతుల్లో 78, 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) వీరవిహారం చేయడంతో ఆ జట్టు 19.1 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదనను పూర్తిచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. కెప్టెన్ అజింక్యా రహానే (40 బంతుల్లో 67, 3 ఫోర్లు, 5 సిక్స్‌లు), అంగ్క్రిష్ రఘువంశీ (29 బంతుల్లో 51, 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 220 రన్స్ చేసింది.
ఛేదించాల్సిన లక్ష్యం భారీగా ఉన్నా బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై ముంబై ఓపెనర్లు ప్రత్యర్థి బౌలర్లను ఆటాడుకున్నారు. రోహిత్, సఫారీ వికెట్ కీపర్ రికెల్టన్ వీరవిహారంతో ఇన్నింగ్స్ సగానికి వచ్చేసరికి ముంబై విజయం దాదాపుగా ఖాయమైంది. 71 బంతుల్లోనే ఈ జోడీ ఏకంగా 148 రన్స్ జోడించిందంటే వారి విధ్వంసం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వైభవ్ మూడో ఓవర్లో మిడ్ వికెట్ మీదుగా రోహిత్ సిక్స్ కొట్టగా రికెల్టన్ మరో రెండు సిక్స్‌లు బాదాడు. ప్రపంచకప్‌లో మెరిసిన జింబాబ్వే పేసర్ ముజరబాని ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. వరుణ్ తొలి ఓవర్లోనే రోహిత్.. 4, 6, 4తో 15 రన్స్ రాబట్టాడు. కార్తీక్ త్యాగి ఆరో ఓవర్లో హిట్‌మ్యాన్ తన ట్రేడ్‌మార్క్ సిక్స్‌లతో ఐపీఎల్లో 50వ అర్ధ సెంచరీ నమోదుచేశాడు. పవర్ ప్లేలో 80/0తో నిలిచిన ముంబై ఆ తర్వాత రికెల్టన్ సిక్స్‌ల తుఫానుతో 9 ఓవర్లకే 110 రన్స్‌తో పటిష్ట స్థితిలో నిలిచింది. ధాటిగా ఆడే క్రమంలో వైభవ్ బౌలింగ్‌లో 4,6 బాదిన హిట్‌మ్యాన్.. ఐదో బంతికి అనుకుల్ అద్భుత క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు. క్రీజులోకి వస్తూనే తనదైన స్కూప్ షాట్‌తో బౌండరీ బాదిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ సూర్య (16) ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు. రికెల్టన్ రనౌట్ అయినా విజయానికి 6 పరుగుల దూరంలో తిలక్ వర్మ (20) నిష్క్రమించినా హార్ధిక్ పాండ్యా (18*) లాంఛనాన్ని పూర్తిచేశాడు.
ముంబై ఆహ్వానం మేరకు మొదలు బ్యాటింగ్‌కు వచ్చిన కోల్‌కతా పవర్ ప్లేలోనే ధనాధన్ ఆటతో దుమ్మురేపింది. కెప్టెన్ రహానే, న్యూజిలాండ్ విధ్వంసకర ఆటగాడు ఫిన్ అలెన్ (17 బంతుల్లో 37, 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) కోల్‌కతాకు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. సిక్స్‌తో రహానే, బౌండరీతో పరుగుల వేటను ఆరంభించిన అలెన్.. అరంగేట్ర బౌలర్ ఘజన్ఫర్, హార్ధిక్‌ను లక్ష్యంగా చేసుకుని బాదడంతో 3.5 ఓవర్లకే కేకేఆర్ స్కోరు 50 దాటింది. బుమ్రా బౌలింగ్‌లో రెండు బౌండరీలు బాదిన అలెన్‌ను ఆరో ఓవర్లో శార్దూల్ ఔట్ చేశాడు. అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్ (18) కూడా శార్దూల్ బౌలింగ్‌లోనే రూథర్‌ఫర్డ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో కేకేఆర్ స్కోరు వేగం నెమ్మదించింది. 27 బంతుల్లో అర్ధ శతకం పూర్తిచేసిన రహానే సైతం శార్దూల్ రెండో స్పెల్‌లో పాండ్యాకు క్యాచ్ ఇచ్చాడు. ఈ క్రమంలో వైస్ కెప్టెన్ రింకూ సింగ్ (21 బంతుల్లో 33 నాటౌట్, 4 ఫోర్లు)తో జతకలిసిన రఘువంశీ బ్యాట్‌కు పనిచెప్పాడు. ఘజన్ఫర్ ఓవర్లో 4,6 బాదాడు. పాండ్యా 19వ ఓవర్లో బౌండరీతో అతడి ఫిఫ్టీ పూర్తయినా మరుసటి బంతికే పెవిలియన్ చేరాడు. ఆఖరి నాలుగు ఓవర్లలో ముంబై బౌలర్లు కట్టడి చేయడంతో కోల్‌కతా 53 పరుగులు మాత్రమే చేయగల్గింది.
1 ఐపీఎల్లో ఒక జట్టుపై అత్యధిక పరుగులు చేసినవారిలో రోహిత్ (కేకేఆర్‌పై 1,161).. కోహ్లీ (పంజాబ్‌పై 1,159) రికార్డును అధిగమించాడు.
కోల్‌కతా: 20 ఓవర్లకు 220/4 (రహానే 67, రఘువంశీ 51, శార్దూల్ 3/39, పాండ్యా 1/39);
ముంబై: 19.1 ఓవర్లకు 224/4 (రికెల్టన్ 81, రోహిత్ 78, నరైన్ 1/30, త్యాగి 1/43)