ఈ ఐపీఎల్ సీజన్లో విజయాల ఖాతా తెరవని ఏకైక జట్టు ముంబై ఇండియన్స్. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు ఈ సీజన్లో ఆడిన అన్ని మ్యాచుల్లోనూ ఓడింది. పంజాబ్ కింగ్స్‌తో ఐదో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ క్రమంతో టీమిండిమా మాజీ ఓపెనర్, దిగ్గజ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ముంబై సారధి రోహిత్ శర్మ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు తను కెప్టెన్ అనే విషయం మర్చిపోవాలని సెహ్వాగ్ సూచించాడు. అలాగే బౌలింగ్ విభాగంలో బుమ్రాపై మరీ ఎక్కువగా ఆధార పడటం కూడా ఆ జట్టు కొంప ముంచిందని వీరూ అన్నాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో కనుక టాస్ ఓడితే ముంబై జట్టు కూడా చెన్నైలా భారీ స్కోరు చేయాలని సూచించాడు.
‘‘ముంబై ప్రతి మ్యాచులోనూ 160-170 పరుగులు చేస్తోంది. కానీ గెలవడానికి ఇవి సరిపోవు. బుమ్రా అయినా సరే ఒంటరిగా ఏమీ చెయ్యలేడు. ఈ విషయంలో బెంగళూరు మ్యాచ్‌లో చెన్నై తీరునే ముంబై కూడా అనుసరించాలి. టాస్ ఓడితే భారీ పరుగులు చేయాలి’’ అని వివరించాడు. అలాగే రోహిత్ కూడా బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు తాను కెప్టెన్ అని మర్చిపోయి ఆడాలన్నాడు. తనను అందరూ ‘హిట్‌మ్యాన్’ అని ఎందుకంటారో రోహిత్ గుర్తుంచుకోవాలని సూచించాడు. మరి పంజాబ్ మ్యాచ్‌తోనైనా ముంబై జట్టు విజయాల బాట పడుతుందేమో చూడాలి.