లక్నో: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ దుమ్మురేపుతున్నది. టైటిల్‌పై మరోమారు కన్నేసిన ముంబై ఆ దిశగా దూసుకెళుతున్నది. గురువారం యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఆరు మ్యాచ్‌ల్లో నాలుగో గెలుపుతో రెండో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్ రేసుకు మరింత చేరువైంది.
యూపీ నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యాన్ని ముంబై 18.3 ఓవర్లలో 153/4 స్కోరు చేసింది. ఓపెనర్ హిలీ మాథ్యూస్(46 బంతుల్లో 68, 8ఫోర్లు, 2సిక్స్‌లు) ధనాధన్ అర్ధసెంచరీతో చెలరేగింది. యూపీ బౌలర్లను చీల్చిచెండాడుతూ బౌండరీలతో కదంతొక్కింది.
మరో ఓపెనర్ అమెలియా కెర్(10) విఫలమైనా..మాథ్యూస్ తన జోరు కొనసాగించింది. ఆఖర్లో అమన్జ్యోత్కౌర్(12 నాటౌట్), యస్తికా భాటియా(10 నాటౌట్) గెలుపు తీరాలకు చేర్చారు. హారిస్‌కు(2/11)కు రెండు వికెట్లు దక్కాయి. తొలుత కెర్(5/38) ధాటికి యూపీ 20 ఓవర్లలో 150/9 స్కోరు చేసింది. జార్జియా(55) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు.