MS Dhoni : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) బ్రేక్ సమయాన్ని నచ్చినట్టుగా ఆస్వాదిస్తున్నాడు. ఐపీఎల్ 18వ సీజన్ తర్వాత రిలాక్స్ అవుతున్న మహీ భాయ్ టెన్నిస్ గ్యాలరీలో ప్రత్యక్షమయ్యాడు. అమెరికాలో జరుగుతున్న యూఎస్ ఓపెన్ మ్యాచ్‌ను స్నేహితులతో కలిసి వీక్షిస్తూ సరదాగా గడిపాడీ వెటరన్. స్టాండ్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ధోనీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.
క్రికెట్ లెజెండ్ అయిన ధోనీ టెన్నిస్ స్టార్లకు అభిమాని. అందుకే వీలు దొరికినప్పుడల్లా వింబుల్డన్, యూఎస్ ఓపెన్ వంటి గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లు చూసేందుకు వెళ్తుంటాడు. ఈసారి మహీ యూఎస్ ఓపెన్ టోర్నమెంట్ చూసేందుకు అమెరికాలో వాలిపోయాడు. టాప్ సీడ్లు నొవాక్ జకోవిచ్, టేలర్ ఫ్రిట్జ్ మధ్య సెప్టెంబర్ 3 బుధవారం జరిగిన మ్యాచ్‌ను చూశాడు ధోనీ.
న్యూయార్క్ నగరంలోని స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ కోసం ధోనీ సింపుల్ డ్రెస్ ఎంచుకున్నాడు. బూడిద రంగు డెనిమ్ షర్ట్, నీలం రంగు జీన్స్.. ట్రిమ్ చేయని గడ్డంతో స్టయిలిష్‌గా కనిపించాడు తాల. తన స్నేహితుడు, వ్యాపారవేత్త అయిన హితేశ్ సాంఘ్వీతో కలిసి జకోవిచ్ ఆటను ఎంజాయ్ చేశాడీ మాజీ సారథి.
సీఎస్కే అభిమానులు ముద్దుగా పిలుచుకునే ‘తాలా’కు ప్రస్తుతం 43 ఏళ్లు. అతడు మరో సీజన్ ఆడడం బహుశా కష్టమే. కానీ, ధోనీ ఇంకొన్ని ఎడిషన్లు ఆడతాడని కొందరు మాజీలు అభిప్రాయపడుతున్నారు.ఈ నేపథ్యంలో మహీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)పై విధ్వంసక బ్యాటింగ్‌తో జట్టును గెలిపించిన ధోనీ.. వయసురీత్యా మరో సీజన్ ఆడడంపై నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు.
‘ఐపీఎల్ ఆరంభం నుంచి మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానులను మర్చిపోలేను. ప్రస్తుతం నాకు 43 ఏళ్లు. సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడుతున్నాను. అయితే.. నేను ఎప్పుడు ఆటకు వీడ్కోలు పలుకుతాను అనేది చాలామంది ఊహించలేరు. ఇప్పటికే నా శరీరంపై భారం పడుతోంది. అందుకే.. ఐపీఎల్ 18వ సీజన్ ముగియగానే 6 నుంచి 8 నెలల పాటు నా శరీరంపై దృష్టి సారిస్తాను. ఒత్తిడిని ఎంత వరకూ తట్టుకుంటుంది? అనే విషయమై అంచనాకు వస్తాను. కాబట్టి.. మరో సీజన్ ఆడడంపై ఇప్పుడే స్పష్టమైన నిర్ణయం వెల్లడించలేను’ అని ధోనీ వెల్లడించాడు. ఈ ఎడిషన్‌లో ఫినిషర్‌గా అలరిస్తున్న సీఎస్కే బుధవారం కోల్‌కతాపై 17 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మొత్తంగా 12 మ్యాచుల్లో 180 రన్స్ కొట్టాడు.