MS Dhoni | భారత క్రీడాకారుల్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఈ విషయంలో మరోసారి రుజువైంది. హర్యానాకు చెందిన అజయ్ గిల్ అనే యువకుడు.. తన అభిమాన క్రికెటర్‌ను కలిసేందుకు కాలినడకన బయలుదేరాడు. స్వస్థలం నుంచి రాంచీకి నడుచుకుంటూ వెళ్లి ధోనీని కలిశాడు.
ఇలా అజయ్ వచ్చి ధోనీని కలవడం ఇది రెండోసారి. గతంలో 1436 కిలోమీటర్ల దూరాన్ని 16 రోజుల్లో పూర్తి చేసిన అజయ్. ఈ సారి 18 రోజులు ప్రయాణించాడు. భవిష్యత్తులో టీమిండియాకు ఆడాలని కలలు కంటున్నట్లు అజయ్ చెప్పాడు. హర్యానాలో బార్బర్‌గా పనిచేసే అజయ్.. ఇటీవలే 12వ తరగతి పరీక్షలు పూర్తిచేశాడు.
ఇలా అజయ్ వచ్చిన విషయం తెలుసుకున్న ధోనీ.. అతన్ని తన ఫాంహౌస్‌లోకి ఆహ్వానించాడట. అక్కడే అతనితో మాట్లాడి తన అభిమానికి ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చి పంపాడు. ఈ క్రమంలో ధోనీతో అజయ్ దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తన ఇంటికి వచ్చిన అజయ్‌ను ఇంటికి పంపేందుకు ధోనీనే ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసినట్లు సమాచారం.