MS Dhoni : టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ (chennai super kings) సారథి మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) నెట్ ప్రాక్టీస్ ఫొటోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. పెద్ద పెద్ద కండలతో ఉన్న ధోనీ హల్క్, థోర్ను తలపిస్తున్నాడంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ధోనీ బుధవారం సాయంత్రం నెట్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ ట్విట్టర్లో పెట్టింది. భారీ షాట్ ఆడేందుకు ధోనీ సిద్ధంగా ఉన్న ఆ సమయంలో తీసిన ఫొటో అది. అందులో అతని కండలు చాలా పెద్దవిగా కనిపించాయి. ఆ ఫొటోకు ‘నిన్నటి రాత్రి ఈస్టర్ గుడ్డు. అసలైనది ఇదిగో’ అని క్యాప్షన్ రాసింది.
41 ఏళ్ల ధోనీ ఈ సీజన్లోనూ సీఎస్కేను నడిపించనున్నాడు. మరో రెండు వారాల్లో పదహారో సీజన్ ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఇప్పటికే చెన్నై చేరుకున్న ధోనీ సాధన మొదలుపెట్టాడు. అతను ఏడాది కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. దాంతో, ఫినిషర్‌గా తన పాత్ర పోషించేందుకు రెడీ అవుతున్నాడు.
నలభై ఏళ్లలో అడుగుపెట్టినా కూడా ధోనీ చాలా ఫిట్‌గా కనిపిస్తున్నాడు. అందుకు కారణం అతని లైఫ్ స్టయిలే. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వేళ తప్పకుండా వర్కవుట్ చేయడం వంటివి ఈ టీమిండియా మాజీ కెప్టెన్ ఫిట్నెస్ మంత్ర. ఫిట్‌గా ఉండేందుకు కార్డియో ఎక్సర్‌సైజ్‌లతో పాటు బరువులు ఎత్తుతాడు. అంతేకాదు ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, గోల్ఫ్ వంటివి ఆడతాడు. మైదానంలో కూల్‌గా ఉండే ధోనీ తెలివైన వ్యూహాలతో ప్రత్యర్థి జట్లను బోల్తా కొట్టించడంలో దిట్ట. తన కెప్టెన్సీలో భారత్ మూడు ఐసీసీ ట్రోఫీలు నెగ్గింది. 2007లో పొట్టి ప్రపంచకప్, 2012లో ఛాంపియన్స్ ట్రోఫీ, 2011లో వన్డే వరల్డ్ కప్ విజేతగా అవతరించింది. ఐపీఎల్‌లోనూ అతను తన ముద్ర వేశాడు. సీఎస్కేకు నాలుసార్లు ఐపీఎల్ ట్రోఫీ అందించాడు.
ఐపీఎల్ (IPL) 16వ సీజన్ మార్చి 31వ తేదీన ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చైన్నై సూపర్ కింగ్స్, హార్దిక్ పాండ్యా (Hardhik Pandya) సారథ్యంలోని డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్ (Gujrat Titans)తో తలపడనుంది. ఈ ఏడాది ప్రతి టీమ్ సొంత గ్రౌండ్లో ఏడు మ్యాచ్‌లు ఆడనుంది. అంతేకాదు ప్రతి జట్టుకు ఇంప్యాక్ట్ ప్లేయర్‌ను తీసుకునే అవకాశం ఉంది. దాంతో, ఈ సీజన్ సరికొత్తగా ఉండనుంది. గత సీజన్లో పెద్దగా రాణించని సీఎస్కే ఈ సారి సత్తా చాటుతుందా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.