Chennai Super Kings | చెన్నై సూపర్‌కింగ్స్.. పేరులోనే ఏదో తెలియని మహత్తు ఉంది. అవును 2008లో ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి గత సీజన్ వరకు అప్రతిహత విజయాలతో ఐదు సార్లు టైటిల్ గెలిచిన జట్టుగా నిలిచిన చెన్నై.. బిజినెస్‌లోనూ తమకు తామే సాటి అని నిరూపించుకుంది. పోయిన సీజన్‌తో పోలిసే 2023లో 80 శాతం వృద్ధి సాధించిన ఐపీఎల్లో.. బ్రాండ్, బిజినెస్ పరంగా చెన్నై అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
హౌలీహన్ లోకే నివేదికను అనుసరించి 2018లో ఐపీఎల్ మార్కెట్ విలువ 8.5 బిలియన్ డాలర్ల నుంచి 2023లో15.4 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇందులో జియో సినిమా, డిస్నీ స్టార్‌తో మీడియా ప్రసార హక్కుల విషయంలో ఐపీఎల్‌కు కాసుల పంట పండింది. 2027లో ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌ను ఐపీఎల్ చేరుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు నివేదికలో పేర్కొంది. ఫ్రాంచైజీల పరంగా చూస్తే 212 మిలియన్ డాలర్లతో చెన్నై సూపర్‌కింగ్స్ టాప్‌లో నిలువగా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 195 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉంది. మ్యాచ్‌ల పరంగా చూస్తే ప్రపంచంలోనే ఖరీదైన లీగ్‌లుగా కొనసాగుతున్న ఎన్బీఏ, ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్, బుందుస్లిగాతో సమంగా ఐపీఎల్ కాసుల పంట పండిస్తున్నది. అమెరికాలో ఉన్న ఫ్రాంచైజీ సంస్కృతిని అనుసరిస్తూ ఐపీఎల్ ద్వారా బీసీసీఐ కోట్లు ఆర్జిస్తున్నది. రానున్న రోజుల్లో ఐపీఎల్ బ్రాండ్ విలువ మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.