గురువారం 02 జూలై 2020
Sports - Apr 15, 2020 , 00:17:46

ధోనీ.. అత్యుత్తమ ఫినిషర్‌

ధోనీ.. అత్యుత్తమ ఫినిషర్‌

  • మహీ శక్తి, ఆత్మవిశ్వాసం అసాధారణం : హస్సీ 
  • ధోనీలో క్రికెట్‌ చాలా మిగిలి ఉంది: రైనా 

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా ఓ వైపు ఐపీఎల్‌ నిర్వహణ సందిగ్ధంలో పడగా.. మరోవైపు కొందరు మాజీలతో పాటు ప్రస్తుత ఆటగాళ్లు టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ గురించి మాట్లాడుతున్నారు. కొందరు అతడి భవిష్యత్తుపై.. మరికొందరు అతడి సామర్థ్యం, గొప్పతనంపై అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్‌ మైక్‌ హస్సీ తాజాగా ఈ జాబితాలో చేరాడు. మహీపై ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచంలో ఆల్‌టైం అత్యుత్తమ ఫినిషర్‌ ధోనీయే అని అతడు అభిప్రాయపడ్డాడు. అసాధారణ శక్తి, ఆత్మవిశ్వాసమే ధోనీని అత్యున్నత స్థానానికి చేర్చాయని అన్నాడు. వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌తో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాజీ ఆటగాడు హస్సీ మాట్లాడాడు. 

‘ధోనీ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండి.. ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌ను అయోమయంలోకి నెడతాడు. మహీకి అసాధారణ శక్తి ఉంది. అయితే, ఎప్పుడు బంతిని బౌండరీ దాటించాలో కూడా అతడికి బాగా తెలుసు. ఆ పని అతడు చేయగలడు. ధోనీకి అంత ఆత్మవిశ్వాసం ఉంటుంది. నిజం చెప్పాలంటే.. నా మీద నాకు అంత నమ్మకం ఉండదు’ అని హస్సీ చెప్పాడు. అలాగే లక్ష్యాన్ని ఛేదించడంలో ధోనీని చూసి తాను కొన్ని విషయాలను నేర్చుకున్నానని చెప్పాడు. బౌలర్లపై ఒత్తిడి పెంచేందుకు అతడు మ్యాచ్‌ను చివరివరకు తీసుకెళతాడని హస్సీ అన్నాడు. నిత్యం మద్దతుగా ఉండే ఫ్రాంచైజీ యాజమాన్యం, కోచ్‌ స్టిఫెన్‌ ఫ్లెమింగ్‌, కెప్టెన్‌ ధోనీ వల్లే చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు ఐపీఎల్‌లో ఇంతకాలం నిలకడగా రాణిస్తున్నదని అతడు చెప్పాడు. 


ధోనీ వల్లే అంతా.. 

మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యం వల్లే ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ అత్యున్నత జట్టుగా కొనసాగుతున్నదని ఆ జట్టు సీనియర్‌ ప్లేయర్‌ సురేశ్‌ రైనా చెప్పాడు. ‘ధోనీ ఏం చేసినా కచ్చితంగా ఉంటుంది. ఏ సమయంలో ఏ బౌలర్‌ను ఎలా ఉపయోగించుకోవాలనేది అతడికి బాగా తెలుసు. వికెట్ల వెనుక ఉండి మహీ మొత్తం నియంత్రిస్తాడు. అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుంటాడు. నేను చెన్నై జట్టులో ఆడడం వల్ల ఎంతో మెరుగయ్యా’ అని చెన్నై సూపర్‌ కింగ్స్‌ వెబ్‌సైట్‌లో రైనా పేర్కొన్నాడు. ఇటీవల జరిగిన ట్రైనింగ్‌ క్యాంప్‌లో ధోనీ ఎంతో అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడని రైనా వెల్లడించాడు. ధోనీలో ఇంకా చాలా క్రికెట్‌ మిగిలేఉందని అభిప్రాయపడ్డాడు


logo