MS Dhoni : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni)కి అభిరుచులు చాలానే. క్రికెట్‌ను ప్రాణంగా ప్రేమించే మహీభాయ్.. బైక్‌లు నడపడంతో పాటు యానిమేషన్, సినిమా రంగంలోనూ ప్రయోగాలు చేస్తుంటాడు. ఇప్పుడు మరో అడుగు ముందేసి సాంకేతికను అందిపుచ్చుకున్నాడు అతడు. ఇన్నిరోజులు మైదానంలో హెలిక్యాప్టర్ షాట్లతో అలరించిన ధోనీ ఇకపై ఆకాశంలోనూ తన మార్క్ చూపించనున్నాడు. అవును.. ‘సర్టిఫైడ్ డ్రోన్ పైలెట్’ (Certified Drone Pilot)గా గుర్తింపు సాధించాడీ వెటరన్. ఈ సంతోషకరమైన విషయాన్ని ధోనీ అభిమానులతో పంచుకుంది గరుడ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.
భారత్‌లోని ప్రముఖ ఏరోస్పేస్ సంస్థ అయిన గరుడ ఏరోస్పేస్ (Garuda Aerospace) నుంచి ధోనీ డ్రోన్ పైలెట్ లైసెన్స్ సాధించాడు. డ్రోన్ల తయారీకి ప్రసిద్ధి చెందిన ఈ కంపెనీకి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న మహీ.. ఇప్పుడు అదే సంస్థ నుంచి సర్టిఫైడ్ డ్రోన్ పైలెట్‌గా అవతరించాడు. ఇటీవలే చెన్నైలో కంపెనీ డీజీసీఏ అప్రూవ్డ్ రిమోట్ కంట్రోల్ శిక్షణ కేంద్రంలో పాల్గొన్న ధోనీ.. తన నైపుణ్యాలను ప్రదర్శించి లైసెన్స్ పట్టేశాడు.
When legends take flight, the nation follows.
MS Dhoni is now a DGCA Certified Drone Pilot — trained under Garuda Aerospace, India’s DGCA Approved RPTO.
Empowering the next generation of drone pilots to soar higher.@AgnishwarJ@msdhoni#GarudaAerospace #MSDhoni #DronePilot… pic.twitter.com/igTe42bPHh— Garuda Aerospace Pvt Ltd (@garuda_india) October 7, 2025
‘గరుడ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రచారకర్త, పెట్టుబడిదారుగా ఉన్న ధోనీ ట్రైనింగ్ పూర్తి చేసుకొని.. డ్రోన్ పైలెట్ లైసెన్స్ సాధించాడు. అతడు చాలా త్వరగా డ్రోన్ ఎగురేయడం నేర్చుకున్నాడు. డ్రోన్ పరిశ్రమలో విస్తరించాలనుకున్న మా టీమ్‌కు ధోనీ కీలకం కానున్నాడు. అతడి లాంటి లెజెండ్స్ ఏదైనా పాటిస్తే దేశం మొత్తం వాళ్లను అనుసరిస్తుంది. ప్రస్తుతం ధోనీ డీజీసీఏ సర్టిఫైడ్ డ్రోన్ పైలెట్. అతడు గరుడ ఏరోస్పేస్ కేంద్రంలో శిక్షణ పొందాడు. ఇప్పటికే 2,500 మంది ఔత్సాహిక యువతకు డ్రోన్ పైలటింగ్‌లో ట్రైనింగ్ ఇచ్చాం’ అని ఎక్స్ పోస్ట్‌లో వెల్లడించింది గరుడ స్పేస్.
ఐపీఎల్ లెజెండ్ అయిన ధోనీ చెన్నై సూపర్ కింగ్స్‌కు రికార్డు స్థాయిలో ఐదు ట్రోఫీలు అందించాడు. అశేష అభిమానగణమున్న ఈ వెటరన్.. నలభైల్లోనూ కుర్రాడిలా చెలరేగిపోతున్నాయి. అయితే.. వచ్చే సీజన్ ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. తన శరీరం సహకరిస్తే వచ్చే రెండు మూడు నెలల్లో నిర్ణయం ప్రకటిస్తానని ఐపీఎల్ 18వ సీజన్ ముగియగానే తాలా పేర్కొన్నాడు.
వయసు పైబడడం, గాయాలు వేధిస్తుండడంతో అతడు వైదొలిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే తన సారథిగా రుతురాజ్ గైక్వాడ్‌ను ప్రకటించిన ధోనీ.. అతడు గాయంతో నిష్క్రమించడంతో మళ్లీ పగ్గాలు అందుకున్నాడు. ఈమధ్యే కోలుకున్న గైక్వాడ్ వచ్చే సీజన్లో సీఎస్కేను నడిపించడం ఖాయం.