John Beleniuk | పారిస్: గత రెండు ఒలింపిక్స్‌లలో పతకాలు గెలిచిన ఉక్రెయిన్ దిగ్గజ రెజ్లర్, ఆదేశ ఎంపీ అయిన ఝాన్ బెలెన్యుక్ పారిస్‌లోనూ సత్తాచాటాడు. 33 ఏండ్ల ఈ రెజ్లర్ 85 కిలోల గ్రీకో రోమన్ కేటగిరీలో కాంస్యం గెలుచుకుని వరుసగా మూడో ఒలింపిక్స్‌లోనూ పతకాలు గెలిచిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. కాంస్య పోరులో బెలిన్యుక్.. 3-1తో అర్కడియుస్ (పోలండ్)ను ఓడించాడు. రియోలో రజతం, టోక్యోలో స్వర్ణం నెగ్గిన బెలెన్యుక్ పారిస్‌లో కాంస్యం నెగ్గిన తర్వాత మ్యాట్‌పైనే ఉక్రెయిన్ సంప్రదాయ నృత్యాన్ని చేసి తన షూస్‌ను అక్కడే విప్పేసి ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
2019లో పీపుల్ పొలిటికల్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచిన అతడు ఇకపై తాను ప్రజాసేవలోనే నిమగ్నమవుతానని, ఉక్రెయిన్ భవిష్యత్ కోసం తాను కృషి చేస్తానని అన్నాడు. ‘పతకం గెలిచినందుకు సంతోషంగా ఉంది. కానీ ఒక ఉక్రెయిన్ పౌరుడిగా నాకు నా దేశం మనుగడ సాగించడం అత్యంత ప్రాధాన్యాంశం. దురదృష్టవశాత్తూ ఉక్రెయిన్‌లో మా భవిష్యత్ ఏంటో మాకే తెలియడం లేదు’ అని భావోద్వేగంగా మాట్లాడాడు. రష్యాతో యుద్ధం నేపథ్యంలో గత రెండేండ్లుగా ఉక్రెయిన్ అతలాకుతలమవుతున్న విషయం విదితమే