హైదరాబాద్ ఆట ప్రతినిధి: ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ నెల 22న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల విక్రయాలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. నగరంలో ఈ సీజన్‌కు ఇదే చివరి మ్యాచ్ కావడం, అందులోనూ భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతుండటంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ క్రేజ్‌ను ఆసరాగా చేసుకుని సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం టికెట్ ధరలను దాదాపు రెట్టింపు చేసింది. గత మ్యాచ్‌లకు రూ. 950 గా ఉన్న కనీస టికెట్ ధరను రూ. 1,950కి పెంచగా, గరిష్టంగా కార్పొరేట్ బాక్స్ పాస్ ధరను ఏకంగా రూ. 45 వేలకు పెంచి అభిమానుల సొమ్మును దండుకుంటోంది. సామాన్య క్రికెట్ ప్రేమికులు కొనుగోలు చేసే సాధారణ స్టాండ్స్ ధరలను సైతం అమాంతం పెంచేయడం తీవ్ర నిరాశకు గురి చేసింది.
గతంలో తక్కువ ధరకే లభించిన సౌత్ టెర్రస్ టికెట్‌ను ఇప్పుడు రూ. 3,500 పెంచారు. ఈస్ట్, వెస్ట్ స్టాండ్స్ ఫస్ట్ ఫ్లోర్ టికెట్ ధర గత మ్యాచ్‌లకు రూ. 2,500 కాగా, ఈ మ్యాచ్‌కు రూ. 4,500కి పెరిగింది. ఇదే స్టాండ్స్‌లో గ్రౌండ్ ఫ్లోర్ టికెట్ ధరను రూ. 6,000కు పెంచడం గమనార్హం. హాస్పిటాలిటీ ఉన్న స్టాండ్స్ టికెట్ ధర గత మ్యాచ్‌కు రూ. 8,500 కాగా, ఈ మ్యాచ్‌కు రూ. 13,000 కు పెంచారు. గతంలో రూ. 30 వేలుగా ఉన్న సౌత్ స్టాండ్ కార్పొరేట్ బాక్స్ టికెట్ ధరను ఏకంగా రూ. 45 వేలకు పెంచి కాసుల వేట సాగిస్తోంది.
ఐపీఎల్ లో ప్రతి ఫ్రాంచైజీ సొంతగడ్డపై జరిగే ఏడు మ్యాచ్‌లకు టికెట్ ధరలను సొంతంగా నిర్ణయిస్తుంది. కొన్ని ఫ్రాంచైజీలు రూ. 500 కూడా టికెట్లను అందుబాటులో ఉంచుతుంటే, సన్‌రైజర్స్ యాజమాన్యం మాత్రం సీఎస్కే, ముంబై, ఆర్సీబీ లాంటి మేటి జట్లతో మ్యాచ్‌లు ఉన్నప్పుడు టికెట్ ధరలను భారీగా పెంచుతోంది. ఫ్రాంచైజీ పేరులో హైదరాబాద్ అని వాడుకుంటూ, గత చాలా ఏళ్లుగా ఒక్క లోకల్ ప్లేయర్‌కు కూడా అవకాశం ఇవ్వని సన్‌రైజర్స్ యాజమాన్యం, ఇక్కడి అభిమానుల క్రికెట్ పిచ్చిని మాత్రం వ్యాపారంగా మార్చుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ధరల పెంపు ఒకెత్తయితే, ఆన్లైన్ బుకింగ్స్ ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం మరికొన్ని అనుమానాలకు తావిస్తోంది. జొమాటో డిస్ట్రిక్ట్ యాప్‌లో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు టికెట్ల అమ్మకాలు ప్రారంభించగా, కేవలం నిమిషాల వ్యవధిలోనే టికెట్లన్నీ అమ్ముడైనట్లు ’సోల్ ఔట్’ బోర్డు ప్రత్యక్షమైంది. ఉప్పల్ స్టేడియం మొత్తం సామర్థ్యం 39 వేల సీట్లు కాగా, ఇందులో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, పోలీస్ శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాలకు ఇచ్చే ఉచిత కాంప్లిమెంటరీ పాసులు పోను సుమారు 30-32 వేల టికెట్లు విక్రయిస్తారు. అయితే ఆన్లైన్ విక్రయాలు ప్రారంభం కాగానే దాదాపు 3 లక్షల మంది అభిమానులు క్యూలో నిరీక్షిస్తున్నట్లు చూపించి, కంటికి కనిపించకుండానే వేలాది టికెట్లు మాయం కావడం వెనుక పెద్ద దందా నడిచిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఫ్యాన్స్‌ను బురిడీ కొట్టించి, తెరవెనుక ఈ టికెట్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించారని అభిమానులు సామాజిక మాధ్యమాల్లో మండిపడుతున్నారు. త్వరలో మరోసారి సేల్ ఉంటుందని యాప్‌లో చూపిస్తున్నప్పటికీ.. ఇప్పటివరకు అసలు ఎన్ని టికెట్లు అమ్మారు? ఇంకా ఎన్ని ఖాళీగా ఉన్నాయి? అనేది సన్‌రైజర్స్ యాజమాన్యానికి తప్ప ఎవరికీ తెలియకపోవడం గమనార్హం.