Hardik Pandya: పదేండ్లపాటు ముంబై ఇండియన్స్‌ను విజయవంతంగా నడిపించి ఆ ఫ్రాంచైజీకి ఐదు ట్రోఫీలను అందజేసిన రోహిత్ శర్మను పక్కనబెట్టి గుజరాత్ టైటాన్స్‌కు సారథిగా వ్యవహరించిన హార్ధిక్ పాండ్యాను అరువు తెచ్చుకుని మరీ కెప్టెన్‌గా నియమించుకున్న ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్ తప్పేట్టులేదు. వన్డే వరల్డ్ కప్‌లో గాయపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న హార్ధిక్ పాండ్యా.. వచ్చే ఐపీఎల్ సీజన్ నాటికి కూడా పూర్తిగా రికవరీ అయ్యేది కష్టమేనని తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ పొందుతున్న హార్ధిక్.. మార్చి మాసాంతం నాటికి ఫిట్నెస్ సాధించడం కష్టమేనని బీసీసీఐ వర్గాలె చెబుతున్నాయి.
హార్ధిక్ హెల్త్ అప్డేట్కు సంబంధించిన విషయమై బీసీసీఐ ప్రతినిధఙ ఒకరు పీటీఐతో మాట్లాడుతూ…‘ఇప్పటికైతే హార్ధిక్ ఫిట్నెస్ స్టేటస్ పై ఎటువంటి అప్డేట్ కూడా లేదు. కనీసం ఐపీఎల్ ముగిసేవరకైనా అతడు అందుబాటులో ఉండటం కూడా ప్రశ్నార్థకంగా ఉంది..’ అని తెలిపాడు. వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా పూణె వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడుతూ హార్ధిక్ చీలమండకు గాయమైన విషయం తెలిసిందే. అతడి కోసం బీసీసీఐ.. శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్‌లకు ఇచ్చిన 18 వారాల ప్రత్యేక శిక్షణను ప్లాన్ చేసినట్టు గతంలో వార్తలొచ్చాయి.
Hardik Pandya unlikely to recover for Afghanistan T20I series and uncertain for IPL 2024 as well. (Hindustan Times) pic.twitter.com/KWGRWeEd19
— Vishal. (@SPORTYVISHAL) December 23, 2023
ఇక తాజాగా హార్ధిక్ ఫిట్‌నెస్‌పై వస్తున్న వార్తలు ముంబై యజమాన్యాన్ని ఆందోళనకు గురిచేసేవే. అసలే రోహిత్‌ను కెప్టెన్‌గా తప్పించినందుకే ఆ జట్టు తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రోహిత్ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియా వేదికగా నానా రచ్చ చేశారు. రోహిత్ కూడా ముంబై నిర్ణయం పట్ల అసంతృప్తిగా ఉన్నాడని, వేలం ముగిసిన తర్వాత ఓపెన్ అయిన ట్రేడ్ విండో (బదిలీ ప్రక్రియ)లో భాగంగా అతడు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్నాడన్న పుకార్లు షికార్లు చేస్తున్న విషయం విదితమే. అటు హార్ధిక్ కోసం గుజరాత్ టైటాన్స్‌కు భారీగా చెల్లించి (ట్రేడ్ వాల్యూ ఎంతనేది ఇంతవరకూ వెల్లడించలేదు) దక్కించుకున్నా హార్ధిక్ అందుబాటులో ఉండటం కష్టమేనని సమాచారం వస్తుండటంతో ఆ జట్టుకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. హార్ధిక్ ఫిట్నెస్ అటు ముంబైతో పాటు భారత జట్టుకు కూడా ఆందోళన కలిగించేదే. జనవరిలో అఫ్గాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అతడు అందుబాటులో ఉండటం కష్టమేనని తెలిసినా కనీసం ఐపీఎల్ వరకైనా రెడీ అయితే మే లేదా జూన్లలో జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్ కప్ వరకైనా సిద్ధమవుతాడనుకుంటే తాజాగా అతడి ఫిట్నెస్ మాత్రం ఆందోళన కలిగిస్తున్నది.