హైదరాబాద్: మొహమ్మద్ సిరాజ్(Mohammed Siraj) 29వ పుట్టిన రోజు ఇవాళ. ఆ హైద్రాబాదీ బౌలర్ ఈ సందర్భంగా ఆర్సీబీ(RCB) పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలో అతను పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆస్ట్రేలియాతో 2020-21 సీజన్లో జరిగిన సిడ్నీ టెస్టు సమయంలో సిరాజ్ జాత్యహంకార(Racism) అవమానాన్ని ఎదుర్కొన్నారు. మైదానంలో అతను ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో .. గ్యాలరీల్లో ఉన్న కొందరు ప్రేక్షకులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియన్లు తనను బ్లాక్ మంకీ అని పిలిచినట్లు సిరాజ్ ఆరోపించాడు. పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని చెప్పాడు.
బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు తొలి రోజు కొందరు అనిచిత వ్యాఖ్యలు చేశారని, అయితే తాగిన మత్తులో వాళ్లు అలా చేసి ఉంటారని భావించినట్లు సిరాజ్ చెప్పాడు. ఇక రెండో రోజు కూడా స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు అదే తరహాలో ప్రవర్తించినట్లు సిరాజ్ తెలిపాడు. అయితే ఈ విషయాన్ని రహానే(Rahane)కు చెప్పానని, అప్పుడు ఆ విషయాన్ని రహానే అంపైర్లకు చెప్పాడని సిరాజ్ గుర్తు చేశాడు. ఫీల్డ్ వదిలి వెళ్లమని అంపైర్లు సలహా ఇచ్చారని, కానీ తాము ఎందుకు వెళ్లాలని రహానే వాదించినట్లు సిరాజ్ వెల్లడించాడు.
ఆసీస్ టూర్ సమయంలో తన తండ్రి మరణించిన విషయం తనను ఎంతో బాధకు గురిచేసిందన్నారు. బయోబబుల్(biobubble) ఉండడం వల్ల ఏ ఒక్క ప్లేయర్ కూడా మరొకరి రూమ్‌కు వెళ్లేవారు కాదని, కేవలం వీడియో కాల్స్ మాత్రమే ఉండేవన్నారు. తన ఫియాన్సీతో కూడా ఫోన్లో మాట్లాడేవాడినని చెప్పాడు. కోచ్ రవిశాస్త్రి(ravi shastri) తనను ఎంకరేజ్ చేసినట్లు తెలిపాడు.