ముంబై: తాజా ఐపీఎల్ సీజన్లో తన ప్రదర్శనతో సంతృప్తిగా లేకపోయినా.. ఇంగ్లండ్ పర్యటనలో సత్తాచాటుతానని హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. ఐపీఎల్లో బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన సిరాజ్ 15 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. 10.07 ఎకానమీ నమోదు చేయడంతో పాటు.. అత్యధిక సిక్సర్లు (31) సమర్పించుకున్న బౌలర్‌గా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. బుధవారం ‘బందో మే థా దమ్’ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా సిరాజ్ మాట్లాడుతూ.. ‘గత రెండు ఐపీఎల్ సీజన్లు బాగా సాగినా.. ఈ సారి నా ప్రదర్శన చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. కానీ బలంగా తిరిగొస్తాననే నమ్మకముంది.
ఇంగ్లండ్‌తో జరుగనున్న ఏకైక టెస్టు కోసం ప్రాక్టీస్ ప్రారంభించా. తేమతో కూడిన వాతావరణంలో డ్యూక్ బంతితో బౌలింగ్ చేసేందుకు ఆతృతతో ఎదురుచూస్తున్నా’ అని అన్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి బంతులేయడం ముఖ్యమని.. నిలకడ కొనసాగించడమే తన ప్రధాన లక్ష్యమని సిరాజ్ చెప్పుకొచ్చాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించాలననేది తన తండ్రి కన్న కల అని.. గబ్బా వేదికగా ఆస్ట్రేలియాపై ఐదు వికెట్లు తీసిన ప్రదర్శనను ఎప్పటికీ మరువలేనని సిరాజ్ పేర్కొన్నాడు.