Mohammed Shami: వన్డే వరల్డ్ కప్‌లో భారత జైత్రయాత్రపై అక్కసు వెళ్లగక్కుతున్న పాకిస్తాన్ మీడియాతో పాటు ఆ జట్టు మాజీ క్రికెటర్ హసన్ రాజాకూ టీమిండియా పేసర్ మహ్మద్ షమీ సాలిడ్ కౌంటర్ ఇచ్చాడు. ప్రపంచకప్‌లో భారత బౌలర్లకు ప్రత్యేక బంతులిస్తున్నారని, డీఆర్ఎస్ నిర్ణయాలు సైతం వారికి అనుకూలంగా ఉన్నాయని హసన్ రాజా ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. హసన్ రాజా కామెంట్స్‌పై షమీ స్పందిస్తూ.. వరల్డ్ కప్ అంటే గల్లీలో జరిగే టోర్నీ కాదని, కనీసం ఆ దేశ ఆటగాళ్ల చెబుతున్నదైనా పాక్ మాజీలు వింటే మంచిదని ఫైర్ అయ్యాడు.
తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో షమీ స్పందిస్తూ.. ‘సిగ్గుపడండి. ఆట మీద దృష్టి పెట్టండి. ఇతరుల విజయాన్ని ఆనందించడం నేర్చుకోండి. ఇదేమైనా గల్లీ టోర్నీమెంట్ అనుకున్నావా..? ఐసీసీ ఈవెంట్. మీ మాజీ క్రికెటర్ వసీం భాయ్ (వసీం అక్రమ్) చెప్పేదైనా కాస్త వినండి. వాళ్లమీద అయినా నమ్మకం ఉంచండి. మిమ్మల్ని మీరు పొగుడుకునే పనిలో బిజీగా ఉన్నారు’ అంటూ ప్రస్తుతం ఇన్‌స్టాలో ట్రెండ్ అవుతున్న ‘జస్ట్ లైక్ వావ్’ వ్యాఖ్యను జోడించాడు. షమీ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.
Shami hitting strongly on-field & off-field….!!!! pic.twitter.com/hpbvum2VMl
— Johns. (@CricCrazyJohns) November 8, 2023
షమీ పోస్టు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈమెగా టోర్నీలో నాలుగుమ్యాచ్లే ఆడిన షమీ.. ఏకంగా 16 వికెట్లు తీసి భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ నెటిజన్లు.. ‘షమీ భయ్యా ఆన్ ఫీల్డ్‌లోనే కాదు.. ఆఫ్ ది ఫీల్డ్ లో కూడా చెలరేగిపోతున్నాడు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.