బరెలీ(యూపీ): టీమ్ఇండియా క్రికెటర్లను లక్ష్యంగా చేసుకుంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఇటీవలే కెప్టెన్ రోహిత్శర్మపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి శమా మహమ్మద్ నోరు పారేసుకోగా, తాజాగా మహమ్మద్ షమీ కూడా లక్ష్యమయ్యాడు.
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస నిబంధనలు ఉల్లంఘిస్తూ షమీ తప్పు చేశాడని ఆల్ఇండియా ముస్లిం జమాత్ మౌలానా షాహబుద్దీన్ రజ్వీ మీడియాతో అన్నాడు. మంగళవారం ఆస్ట్రేలియాతో మ్యాచ్లో షమీ నీళ్లు తాగడాన్ని మౌలానా తీవ్రంగా తప్పుబట్టాడు.
‘షరియత్ చట్టం ప్రకారం తప్పు చేసిన షమీ నేరస్థుడు. రంజాన్ మాసంలో ఉపవాసాన్ని అతిక్రమించడం చాలా తప్పు. అలా ఎవరైనా చేస్తే ఇస్లామిక్ లా ప్రకారం పాపాత్ముడు అవుతాడు. క్రికెట్ ఆడటాన్ని తప్పుబట్టడం లేదు, కానీ మత నిబంధనలు కచ్చితంగా ఫాలో కావాల్సిందే’ అని వీడియోలో పేర్కొన్నాడు.