Mohammad Rizwan | లాహోర్: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు పరిమిత ఓవర్ల ఫార్మాట్లో కొత్త సారథి వచ్చాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆ బాధ్యతలను వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌కు అప్పజెప్పింది. సుమారు ఏడాదిన్నర కాలంగా ఫామ్‌లేమితో బాధపడుతూ జట్టును విజయవంతంగా నడపలేక పోతున్న మాజీ సారథి బాబర్ ఆజమ్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పగా ఆ స్థానాన్ని రిజ్వాన్ భర్తీ చేయనున్నాడు. త్వరలో పాక్.. ఆస్ట్రేలియా, జింబాబ్వే పర్యటనలకు వెళ్లనున్న నేపథ్యంలో పీసీబీ కొత్త సారథి పేరును ఖరారుచేయడం గమనార్హం.
ఇక ఆదివారం పీసీబీ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాలో స్టార్ పేసర్ షహీన్ షా అఫ్రిది ‘ఏ’ కేటగిరీ నుంచి ‘బీ’కి పడిపోయాడు. టెస్టు సారథి షాన్ మసూద్.. ‘డీ’ నుంచి ‘బీ’కు ప్రమోట్ అయ్యాడు. బాబర్, రిజ్వాన్ ‘ఏ’ కేటగిరీలో తమ కాంట్రాక్టులను నిలుపుకున్నారు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌కు బాబర్‌ను పక్కనబెట్టడంపై వ్యాఖ్యానించిన ఫకర్ జమాన్ సెంట్రల్ కాంట్రాక్టును కోల్పోయాడు.