Mohammad Kaif : భారత జట్టు సాధించిన గొప్ప విజయాల్లో 2002లో నాట్ వెస్ట్ ట్రోఫీ ఫైనల్(Natwest Trophy 2002) ఒకటి. ఆ మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన మహ్మద్ కైఫ్(Mohammad Kaif) టీమిండియాకు కప్పు అందించాడు. చురుకైన ఫీల్డింగ్‌తో భారత జాంటీ రోడ్స్(Jonty Rhodes)గా పాపులర్ అయిన అతను తాజాగా తన కెరీర్లో ఎంతో ముఖ్యమైన ఆ రోజును గుర్తు చేసుకున్నాడు. డీడీ ఇండియాలో ‘వర్చువల్ ఎన్కౌంటర్స్'(virtual encounter) షోలో మాట్లాడిన కైఫ్..
‘భారత జట్టును గెలిపించే అవకాశం ఎప్పుడు వచ్చినా సరే అందిపుచ్చుకునేందుకు ప్రతి క్రికెటర్ సిద్ధంగా ఉంటాడు. ఆ రోజు సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) ఔట్ కాగానే క్రీజులోకి వెళ్లాను. ఆ సమయంలో నా మెదుడులో మేము కచ్చితంగా ఓడిపోతాం అనిపించింది. ఎందుకంటే.. అప్పటికే 5 కీలక వికెట్లు పడ్డాయి. మ్యాచ్ విన్నర్ సచిన్ పెవిలియన్ చేరాడు.
కైఫ్, యువరాజ్ సింగ్
అయితే.. ఆటపై, నా శక్తి సామర్థ్యాలపై నాకున్న నమ్మకం ఆరోజు ఆఖరి వరకు పోరాడేలా చేశాయి’ అని కైఫ్ అన్నాడు. అంతేకాదు అప్పుడే కొత్తగా జట్టులోకి వచ్చిన తనకు ఎక్కువ ఓవర్లు బ్యాటింగ్ చేయడం కష్టంగా అనిపించిందని తెలిపాడు. ఏడో స్థానంలో క్రీజులోకి వెళ్లిన కైఫ్ 87 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.
ఇంగ్లండ్ గడ్డపై 2002లో జరిగిన నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో కైఫ్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. లార్డ్స్ స్టేడియం(Lords Stadium)లో మొదట ఆడిన ఇంగ్లండ్ మార్క్ ట్రెస్కోథిక్, నాసిర్ హుస్సేన్ సెంచరీలు బాదడంతో 326 పరుగులు కొట్టింది. భారీ లక్ష్య ఛేదనలో భారత జట్టు 146 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
చొక్కా విప్పి సంబురాలు చేసుకున్న కెప్టెన్ గంగూలీ
సచిన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కైఫ్, యువరాజ్ సింగ్(69)తో కలిసి ఆరో వికెట్‌కు 121 పరుగులు జోడించాడు. ఆ తర్వాత హర్భజన్ సింగ్ సాయంతో ఏడో వికెట్‌కు విలువైన 47 రన్స్ రాబట్టాడు. భారత్ విజయం సాధించగానే అప్పటి కెప్టెన్ సౌరభ్ గంగూలీ(Sourabh Ganguly) చొక్కా విప్పేసి సంబురాలు చేసుకున్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌కు కౌంటర్‌గా గంగూలీ అలా చేశాడు. భారత క్రికెట్లో చారిత్రాత్మకమైన ఆ రోజును అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు.