IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్లో మిచెల్ మార్ష్(Mitchell Marsh) అర్ధ శతకాలతో చెలరేగుతున్నాడు. మంగళవారం ఈడెన్ గార్డెన్స్‌లో వీరవిహారం చేసిన ఈ లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) ఓపెనర్ హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. ఈ ఎడిషన్‌లో మార్ష్‌కు ఇది నాలుగో ఫిఫ్టీ కావడం విశేషం. ఐదు మ్యాచుల్లోనే 4 సార్లు యాభైకి పైగా స్కోర్ చేశాడీ చిచ్చరపిడుగు.
లక్నోకు శుభారంభాలు ఇస్తూ.. భారీ స్కోర్‌కు బాటలు వేస్తున్న ఈ హిట్టర్.. బ్యాక్ టు బ్యాక్ ఫిఫ్టీలతో దిగ్గజాల సరసన చేరాడు. ఐపీఎల్ చరిత్రలోనే తొలి 5 మ్యాచుల్లో నాలుగు హాఫ్ సెంచరీలు బాదిన నాలుగో క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు మార్ష్. గత నాలుగు గేమ్స్‌లో 72, 52, 0, 60 పరుగులతో ఆకట్టుకున్న ఈ డేంజరస్ బ్యాటర్ కోల్‌కతాపై.. 48 బంతుల్లోనే 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 81 రన్స్ స్కోర్ చేశాడు.
మార్ష్ కంటే ముందు విరాట్ కోహ్లీ(Virat Kohli), డేవిడ్ వార్నర్, క్రిస్ గేల్(Chris Gayle) ఈ ఘనత సాధించారు. ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి ఆర్సీబీకి ఆడుతున్న కోహ్లీ.. 2016లో ఐదు మ్యాచుల్లో 4 హాఫ్ సెంచరీలు బాదాడు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా 2016లో వార్నర్ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఆరంభంలోనే నాలుగు అర్థశతకాలతో అదరగొట్టాడు. ఇక యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 2018లో పంజాబ్ కింగ్స్ తరఫున బరిలోకి దిగాడు. బ్యాక్ టు బ్యాక్ ఫిఫ్టీలతో అభిమానులను అలరించాడీ విధ్వంసక ఓపెనర్.