PCB | పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మరో పెద్ద మార్పులకు సిద్ధమవుతోంది. ఉస్మాన్ వహాలా స్థానంలో మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్‌ను బోర్డులో అంతర్జాతీయ క్రికెట్ ఆపరేషన్స్ (DIO) డైరెక్టర్‌గా నియమించే అవకాశం ఉంది. ఈ కీలక పదవి కోసం దరఖాస్తు చేసుకోవాలని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మిస్బాను ఒప్పించారు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్, కోచ్ మిస్బా అంతర్జాతీయ క్రికెట్‌కు సంబంధించిన అన్ని కార్యకలాపాలను నిర్వహించాలని నఖ్వీ కోరుకుంటున్నట్లుగా పలు నివేదికలు తెలిపాయి. ఈ పదవికి పీసీబీ జారీ చేసిన ప్రకటనలో మాజీ దేశీయ, ఇంటర్నేషనల్ క్రికెటర్ అయినా ఉండాలని పీసీబీ సూచించింది. మిస్బా ప్రస్తుతం బోర్డుతో చైర్మన్‌కు మెంటర్, క్రికెట్ సలహాదారుగా కొనసాగుతున్నారు.
ఇటీవల కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్‌ను వన్డే జట్టు నుంచి తొలగించడంలో మిస్బా కీలక పాత్ర పోషించారని సమాచారం. అంతేకాకుండా, బాబర్ అజామ్‌ను ప్రస్తుతానికి టీ20 జట్టుకు తిరిగి తీసుకోకూడదని సెలెక్టర్లకు సూచించినట్లు తెలుస్తున్నది. 2017లో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తర్వాత మిస్బా 2019లో పీసీబీ హెడ్ కోచ్, చీఫ్ సెలెక్టర్ పదవుల బాధ్యతలు చేపట్టాడు. ఏడాది తర్వాత సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవి నుంచి వైదొలిగాడు. 2021లో రమీజ్ రాజా పీసీబీ చైర్మన్ అయ్యాక కోచ్ పదవి నుంచి తప్పించారు. అయినా మిస్బా బోర్డుతో తన అనుబంధాన్ని కొనసాగించాడు. 2024లో రూ.5 లక్షల నెలవారీ జీతం చెల్లిస్తూ డొమిస్టిక్ జట్టుగా మెంటర్‌గా తీసుకున్నారు. అనంతరం చైర్మన్ నఖ్వీ తన క్రికెట్ సలహా కమిటీలో తీసుకున్నాడు. ఇందులో సర్ఫరాజ్ అహ్మద్, సికందర్ బఖ్త్, ఆకిబ్ జావేద్ సైతం ఉన్నారు.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ పదవికి ప్రకటన విడుదల చేసింది. గతంలో ఈ పదవిలో ఉన్న ఉస్మాన్ వహాలా రాజీనామా చేసినట్లు ధ్రువీకరించింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) సెక్రటేరియట్ బాధ్యతలు ఇవొచ్చని భావిస్తున్నారు. మీడియా నివేదికల ప్రకారం.. ఆసియా కప్‌లో భారత్-పాక్ మధ్య జరిగిన గ్రూప్ మ్యాచ్ తర్వాత పీసీబీ వహాలను పదవి నుంచి తొలగించింది. సెప్టెంబర్ 14న జరిగిన ఆ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పాకిస్తాన్ జట్టుతో కరచాలనం చేయడానికి నిరాకరించారు. ఈ అంశంపై పెద్ద వివాదమే చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పీసీబీ తన అంతర్జాతీయ క్రికెట్ డైరెక్టర్ ఉస్మాన్ వహాలాను సస్పెండ్ చేసిందని పాకిస్తాన్ మీడియా పేర్కొంది. మ్యాచ్ రిఫరీ ప్రవర్తన, భారత్ చర్యలకు అధికారికంగా ప్రతిస్పందించడంలో ఆలస్యం కారణంగా వహాలను తొలగించినట్లుగా పాక్ మీడియా పేర్కొంది.