Mirabai Chanu | పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం త్రుటిలో చేజారింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన మహిళల 49కిలోల విభాగంలో బరిలోకి దిగిన భారత స్టార్ లిఫ్టర్ మీరాబాయిచాను కిలో తేడాతో కాంస్య పతకం కోల్పోయింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన పోరులో మణిపూర్ మణిపూస మీరాబాయి 199 కిలోలతో నాలుగో స్థానంలో నిలిచింది. స్నాచ్‌లో 88 కిలోలు ఎత్తిన చాను..క్లీన్ అండ్ జర్క్‌లో 111కిలోలతో మొత్తంగా 199కిలోల బరువెత్తింది. గత(టోక్యో) ఒలింపిక్స్‌లో రజత పతకంతో మెరిసిన మీరాబాయి..ఈసారి అభిమానులను నిరాశపరిచింది.
క్లీన్ అండ్ జర్క్ తొలి ప్రయత్నంలో 111కిలోలు ఎత్తడంలో విఫలమైన మీరా..రెండో ప్రయత్నంలో సఫలమైంది. అయితే మూడో ప్రయత్నంలో 114కిలోలు ఎత్తడంలో విఫలమై పతక అవకాశాన్ని చేజార్చుకుంది. ఇదే పోటీలో చైనాకు చెందిన డిఫెండింగ్ చాంపియన్ హౌ జిహుయి(206కి) ఒలింపిక్ రికార్డుతో పసిడి పతకంతో మెరిసింది. మిహేలా వాలైంటీనా(205కి, రొమేనియా), సురోచనా(200కి, థాయ్‌లాండ్) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. మొత్తంగా భారత్‌కు మరోమారు నాలుగో స్థానంతో మరో పతకాన్ని కోల్పోయింది.