ఫోర్డె(నార్వే): ప్రతిష్టాత్మక ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ లిఫ్టర్ మీరాబాయి చాను వెండి వెలుగులు విరజిమ్మింది. శుక్రవారం జరిగిన మహిళల 48కిలో విభాగంలో బరిలోకి దిగిన మీరాబాయి అంచనాలకు అనుగుణంగా అదరగొట్టింది. 49 కిలోల కేటగిరీ నుంచి 48కి మారినా..మీరా ఏ మాత్రం తడబడలేదు. ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ ఆది నుంచే అద్భుత ప్రదర్శన మీరా మొత్తంగా 199కిలోల బరువెత్తి రెండో స్థానంలో నిలిచింది. స్నాచ్‌లో 84కిలోల బరువెత్తిన ఈ స్టార్ లిఫ్టర్ క్లీన్ అండ్ జర్క్‌లో 115 కిలోలు ఎత్తి ఆకట్టుకుంది.
స్నాచ్‌లో 87కిలోల బరువు ఎత్తడంలో రెండు సార్లు విఫలమైన చాను..క్లీన్ అండ్ జర్క్‌లో ఆకట్టుకుంది. వరుసగా 109కి, 112కి, 115కిలోలతో రాణించింది. టోక్యో(2020) ఒలింపిక్స్‌లో రజతం గెలిచినప్పుడు 115కిలోలే ఎత్తడం గమనార్హం. ఇదే పోటీలో నార్త్‌కొరియాకు చెందిన సాంగ్గమ్ మొత్తం 213కిలోలు(91కి+122కి) ఎత్తి పసిడి పతకంతో పాటు క్లీన్ అండ్ జర్క్, మొత్తం బరువులో కొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. థాయ్‌లాండ్ లిఫ్టర్ ధాన్యాథాన్ 198కిలోల బరువుతో కాంస్యం ఖాతాలో వేసుకుంది. 2028 లాస్ఎంజిల్స్ ఒలింపిక్స్‌కు దీన్ని సన్నాహక టోర్నీగా భావిస్తున్నాను అన్న మీరాబాయి..ఆసియాగేమ్స్, కామన్వెల్త్‌లోనూ రాణిస్తానన్న ధీమాను వ్యక్తం చేసింది.