హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఊత్సాహపూరిత వాతావరణంలో 36వ ఒలింపిక్ డే రన్‌ను ఘనంగా నిర్వహించారు. నగరంలోని వివిధ స్టేడియాల నుంచి యువ క్రీడాకారులు, కోచ్‌లు కాగడాలు చేబూని గురువారం ఒలింపిక్ రన్లో పాల్గొన్నారు. తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పరుగు చివరికి ఎల్బీ స్టేడియానికి చేరుకుంది.
ఈ కార్యక్రమానికి క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవల హర్యానాలో ముగిసిన ఖేలో ఇండియా యూత్‌గేమ్స్‌లో పతకాలు సాధించిన యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్‌తో పాటు మరో ఇద్దరిని మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యమిస్తున్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్నాం. దీనికి తోడు సీఎం ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో స్టేడియాల నిర్మాణం చేపట్టాం.
అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ప్లేయర్లకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, క్రీడాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, టీవోఏ అధ్యక్షుడు వేణుగోపాలచారి, ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్‌యాదవ్, కార్పొరేషన్ల చైర్మన్లు శ్రీధర్‌రెడ్డి, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.