హైదరాబాద్, ఆట ప్రతినిధి: మారుమూల ప్రాంతాల్లో దాగున్న ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రారంభించిన ‘ఈశా గ్రామోత్సవం’ ఈ నెల 5న మహబూబ్‌నగర్‌లో మొదలుకానుంది. ఈశా గ్రామోత్సవం దక్షిణ భారత వ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో 80వేలకు పైగా ప్లేయర్లతో నిర్వహించబడుతున్నది. టోర్నీకి సంబంధించిన పోస్టర్‌ను క్రీడామంత్రి శ్రీనివాస్‌గౌడ్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్కిల్ అండ్ నాలెడ్జ్ అకాడమీ సీఈవో శ్రీకాంత్ సిన్హా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘ఈశా ఫౌండేషన్ ద్వారా మట్టిని రక్షించాలనే కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా ఉద్యమరీతిలో సాగుతున్నది. ఇప్పుడు అదే కోవలో గ్రామీణ స్ఫూర్తిని పెంపొందించేందుకు క్రీడోత్సవం నిర్వహించడం బాగుంది. మహబూబ్‌నగర్‌లో జరిగే కార్యక్రమానికి ప్రభుత్వం పూర్తి సహకారముంటుంది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సంతోష్‌కుమార్, హీరో కిరణ్, గాయకుడు రామ్మిరియాల పాల్గొననున్నట్లు నిర్వహకులు పేర్కొన్నారు. టోర్నీలో పోటీపడాలనుకునే వారు isha.co/gramotsavam లేదా 83000 30999 సంప్రదించవచ్చు. పురుషుల వాలీబాల్ విజేతకు 5లక్షలు, మహిళల త్రోబాల్ 2 లక్షల నగదు ప్రోత్సాహం దక్కనుంది.